Sunday, September 8, 2024
Homeసినిమాకాంతారావుకి మిగిలింది కత్తి గాయాలేనా?

కాంతారావుకి మిగిలింది కత్తి గాయాలేనా?

కాంతారావు .. తెలుగు జానపద కథానాయకుడు. ఎన్టీఆర్ .. ఎన్నార్ తరువాత చెప్పుకునే పేరు. తెలుగు సినిమా కొత్త మార్పు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇండస్ట్రీకి ముందుగా ఏఎన్నార్ .. ఆ తరువాత ఎన్టీఆర్ .. ఆ వెంటనే కాంతారావు వచ్చారు. ఈ ముగ్గురూ కూడా తెలుగు కథలను .. సినిమాలను  ప్రభావితం చేశారు. మొదటి నుంచి  పౌరాణికాలకు ప్రాధాన్యతనిస్తూనే ఎన్టీఆర్ జానపదాలను చేశారు. ఇక సాంఘిక చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేసిన ఏఎన్నార్ కూడా జానపదాలు చేశారు. కానీ కాంతారావు అందుకు భిన్నంగా జానపదాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ అటు పౌరాణికాల్లోను  .. ఇటు సాంఘికాలోను కనిపించారు.

ఎన్టీఆర్  .. ఏఎన్నార్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అయినా ఒకరి సినిమాలో ఒకరు నటించేవారు. అలాంటి ఆ ఇద్దరి సినిమాల్లోను కలిసి నటించడం కాంతారావు ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. తాను ఇతర పాత్రలను చేస్తున్నప్పుడు కృష్ణుడి వేషం కాంతారావు వేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఆ పాత్రకి ఆయనను సిఫార్స్ చేసేవారు. అలాగే ఏఎన్నార్ కూడా తన సినిమాలో కీలకమైన పాత్ర ఉంటే అది కాంతారావు చేస్తే కరెక్టుగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ఆ ఇద్దరూ పిలిచి ఒక మాట అడిగితే చాలు కాంతారావు కాదనేవారు కాదు.

అలా ఆయన ఒక వైపున జానపదాలు .. సాంఘికాలు చేస్తూనే, మరో వైపున పౌరాణికాలలో కృష్ణుడిగా .. లక్ష్మణుడిగా .. నారదుడిగా ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు తెరపై ఆయన ఎన్ని విభిన్నమైన పాత్రలను పోషించినా  ప్రేక్షకులు ఆయనను జానపదాలలో  రాజకుమారుడిగానే చూసుకున్నారు. తెరపై కత్తి యుద్ధాలలో ఆయన చూపించిన నేర్పు కారణంగా ఆయనని ‘కత్తి కాంతారావు‘ అని కూడా పిలుచుకునేవారు. నటుడిగా తీరిక లేకుండా ఉన్న సమయంలోనే ఆ ఆయన చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేశారు.

సినిమా నిర్మాణంలోకి  అనుభవం లేకుండా దిగకూడదు. అందునా అతి మంచితనం .. మొహమాటం ఉన్నవాళ్లు సినిమా నిర్మాణానికి ఎంతదూరం ఉంటే అంత మంచిదని కాంతారావు గురించి తెలిసిన సన్నిహితులు చెప్పారు. ఎందుకంటే ఆ రెండూ కాంతారావులో పుష్కలంగా కనిపిస్తాయి. కానీ ఆయన వినిపించుకోకుండా ‘సప్తస్వరాలు’ .. ‘గండరగండడు’ .. ‘గుండెలు తీసిన మొనగాడు’ .. ‘స్వాతి చినుకులు’ .. ‘చిరంజీవులు’ తీశారు. ఈ సినిమాలు ఆర్థికంగా అంతకంతకూ ఆయనను నష్టాల ఊబిలోకి దింపేశాయి. దాంతో ఆయన ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశారు.

ఆ తరువాత ఇండస్ట్రీతో పాటు హైదరాబాద్ వచ్చిన ఆయన, సినిమాల్లో ఒకటి అరా వేషాలు వేస్తూ, టీవీ సీరియల్స్ లో బిజీ అయ్యారు. అలా బుల్లితెర కొంతవరకూ ఆయనను ఆదుకుంది. సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయినందుకు చివరి రోజులలో ఆయన చాలా బాధపడ్డారు. గొప్ప గొప్ప దర్శకులతో ఎన్నో సినిమాలు చేసి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన, చివరి రోజుల్లో ఇబ్బందులు పడ్డారు. జానపద సినిమాల్లో హీరోగా వీరోచిత పోరాటాలు చేస్తున్నప్పుడు అయిన కత్తి గాయాలే చివరి రోజుల్లో ఆయన వెంట ఉన్నాయనిపిస్తుంది. మొహమాటం కారణంగా ఆర్ధికంగా ఆయన చితికిపోయినా, ఆయన చేసిన సినిమాలు ఆణిముత్యాలే .. ఆయన చేసిన పాత్రలు జాతిరత్నాలే .. ఆయన ఎప్పటికీ తెలుగు తెర రాజకుమారుడే.

—  పెద్దింటి గోపీకృష్ణ

Also Read : 

కత్తి యుద్ధం కాంతారావు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్