Monday, June 17, 2024
HomeTrending News19 నుంచి జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు

19 నుంచి జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు

జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు. సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి తెలిపారు. జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారన్నారు. జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి పరిధిలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఉదయం 8-45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు. ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్