Monday, February 24, 2025
HomeTrending Newsనా గొంతు నొక్కలేరు: శ్రీధర్ రెడ్డి

నా గొంతు నొక్కలేరు: శ్రీధర్ రెడ్డి

తనను అరెస్టు  చేస్తారంటూ లీకులు ఇస్తున్నారని, దానికి భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. లీకులు ఇవ్వడం ఎందుకని, దమ్ముంటే నేరుగా వచ్చి అరెస్టు చేయాలని సవాల్ చేశారు. తన గొంతు నొక్కాలని చూస్తున్నారని, కానీ ఎన్ కౌంటర్ చేస్తే తప్ప  అది సాధ్యం కాదని అన్నారు. తనను ఒక్కడిని చేసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న మీడియాతో మాట్లాడిన అంశాలపై కోటంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను జగన్ కు ద్రోహం చేశానని, తన బిడ్డలకు ఆ పాపం తగులుతుందని అనిల్ మాట్లాడారని.. నిజంగా తాను జగన్ కు ద్రోహం చేసి ఉంటే తనను నాశనం చేయాలని, లేని పక్షంలో తనకు అండగా నిలవాలని రుద్రాక్ష సాక్షిగా దేవుణ్ణి ప్రార్దిస్తున్నట్లు… తన మెడలోని  రుద్రాక్షను చేతిలోకి తీసుకొని శపథం చేశారు. అనిల్ కు తాను రాజకీయంగా ఎంత అండగా నిలిచానో అందరికీ తెలుసనీ, అనిల్ ను తన కుమార్తెలు కుటుంబ సభ్యుడిగానే భావించారని, అలాంటి  వ్యక్తి  తన బిడ్డలపై మాట్లాడడం బాధ కలిగించిందన్నారు.

డిసెంబర్ 25న తాను ఉదయం నుంచీ రాత్రి వరకూ నెల్లూరులో క్రిస్మస్ వేడుకల్లో బిజీగా గడిపానని, తాను ఆరోజు చంద్రబాబుతో సమావేశం అయినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా నియమించారని, ఆయన్ను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ఆయన కృషి చేయాలని, అధికార పార్టీకి దూరమైన ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం అందిస్తానని ప్రకటించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చూస్తుకుందామని, ఈలోగా అభివృద్ధి చేద్దామని ప్రతిపాదించారు.

Also Read : ట్యాపింగ్ ముమ్మాటికీ నిజం: శ్రీధర్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్