Saturday, July 27, 2024
Homeతెలంగాణపట్టు వదలని విక్రమార్కుని సోదరుడు మల్లు రవి

పట్టు వదలని విక్రమార్కుని సోదరుడు మల్లు రవి

శాసనసభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించటంతో కాంగ్రెస్ పార్టీలో ఎంపి సీట్ల కోసం పోటీ పెరిగింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. నాగర్ కర్నూల్ స్థానం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఒకడుగు ముందుకు వేశారు. ఇటీవలే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన మల్లు రవి నెల రోజులు కూడా తిరిగక ముందే రాజీనామా లేఖ ఇచ్చారు.

నాగర్ కర్నూల్ ఎంపి టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంలో కాంగ్రెస్ అధిష్టానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ వర్గం వారికే టికెట్ ఇవ్వాలనే కోణంలో పరిశీలన జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం పార్టీ టికెట్ కోసం అనేకమంది దరఖాస్తు చేసినా… ఈ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇటీవల పార్టీలో చేరిన మంద జగన్నాథం పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకొని మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీకి పంపారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొదటి నుంచి ఎంపిగానే పోటీలో ఉంటానని… నాగర్ కర్నూల్ నుంచే పోటీ చేస్తానని మల్లు రవి బహిరంగంగానే  చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఈయనకే టికెట్ అని అందరు భావించారు. సిఎం పదవి కోసం పోటీ ఏర్పడిన సమయంలో కూడా తన సోదరుడు మల్లు భట్టి విక్రమార్కను కాదని రేవంత్ వెంటే మల్లు రవి ఉన్నాడని అంటారు.

శాసనసభ ఎన్నికల్లో గెలిచిన హవాలో ఎంపిగా కొత్త పార్లమెంటు భవనంలో ఆడుగుపెడదామనుకున్న మల్లు రవికి ఢిల్లీ ప్రతినిధి పదవి పచ్చి వెలక్కాయ అయింది. బాధ్యతలు స్వీకరించినా… 15 రోజులుగా సన్నిహితులతో తర్జనభర్జనలు చేసిన సీనియర్ నేత పదవికి రాజీనామానే పరిష్కారమని లేఖ ఇచ్చేశారు. రాజీనామా తర్వాత ఆచితూచి స్పందించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రస్తావించారు. ఆ లెక్కన సిఎం రేవంత్ రెడ్డి జోడు పదవులు నిర్వహిస్తున్నారని నర్మగర్భంగా గుర్తు చేశారు.

పార్టీ అధిష్టానం మాత్రం సంపత్ కుమార్ వైపు మొగ్గు చూపుతోందని ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మాదిగ వర్గానికి ఆ స్థాయిలో పదవి ఇవ్వలేదు. ఆ లోటు భర్తీ చేసేందుకు రెండు మూడు ఎంపి స్థానాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోందని వినికిడి. అందుకే పెద్దపల్లి టికెట్ వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వటం లేదని తెలిసింది. వరంగల్, నాగర్ కర్నూల్ స్థానాలు కూడా ఆ వర్గాలకే ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయి.

పెద్దపల్లి, వరంగల్ స్థానాలు మాదిగలకు ఇస్తే నాగర్ కర్నూల్లో మల్లు రవికి అవకాశం ఉంటుందని మరో వాదన జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే మూడు స్థానాలు మాదిగలకే ఇవ్వాలి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మాల నేతలదే ఆధిపత్యం. గతంలో వారసత్వ, బందువర్గాలకు ప్రాధాన్యత  ఉండేది.. అలా కాకుండా సిఎం రేవంత్ రెడ్డి వైఖరి అన్ని స్థానాలు గెలవాలనే కోణంలో ఉందంటున్నారు.

దామాషా లెక్కల్లో మల్లు రవి భవితవ్యం త్వరలోనే తేలనుంది. గతంలో తానూ, తన సోదరుడు మల్లు అనంతరాములు ప్రాతినిధ్యం వహించిన నాగర్ కర్నూల్ వదులుకునే ప్రసక్తే లేదని మల్లు రవి పట్టుదలగా ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్