కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచాన్ని కొత్త వైరస్‌లు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలోని ఘనాలో అత్యంత వేగంగా వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూడటం ఉలికిపాటుకు గురిచేసింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా మర్‌బర్గ్ వైరస్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఘనా రాజధాని ఆక్రా సహా పశ్చిమ ఆఫ్రికాలో ముఖ్య నగరాలన్నింటిలో వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ వచ్చిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మర్‌బర్గ్ వైరస్ దేని ద్వారా సోకిందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మర్‌బర్గ్ వైరస్ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది.