Mughal Gardens : దేశరాజధాని రాష్ట్రపతి నిలయంలొని మొఘల్ గార్డెన్స్ ప్రజల సందర్శనార్ధం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు తెరిచి ఉంటుందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అడ్వాన్స్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే సందర్శకులను అనుమతిస్తామని తెలిపింది. కరోనా జాగ్రత్తల్లో భాగంగా గతేడాది మాదిరిగానే నిబంధనలు ప్రస్తుతం కూడా కొనసాగుతాయని పేర్కొంది. నేరుగా మొఘల్ గార్డెన్స్ (వాక్-ఇన్ ఎంట్రీ) సందర్శించేందుకు అవకాశం లేదని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో వార్షిక ‘ఉద్యానోత్సవ్’ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. ఫిబ్రవరిలో దశలవారీగా వికసించే 11 రకాల తులిప్స్ పూలు ఉద్యానోత్సవ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతే కాకుండా సెంట్రల్ లాన్‌లలో అద్భుతమైన డిజైన్‌లలో ఫ్లవర్ కార్పెట్‌లనూ ప్రదర్శించనున్నారు.