యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నాటు నాటు పాటకుగాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నాటు నాటు పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ చేసింది.

ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా సోదరుడు, ఇండియాలో బాగా పాపులర్ అయిన దర్శకుడు రాజమౌళికి ఈ అవార్డ్ క్రెడిట్ దక్కుతుంది. అలాగే టీమ్ అందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఈ అవార్డ్ ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ అన్నారు. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమాన్ తదితరులు రాజమౌళి, కీరవాణి అండ్ టీమ్ కి కంగ్రాట్స్ తెలియచేశారు.

ఈ  అవార్డుతో పాటు ఆంగ్లేతర ఉత్తమ చిత్రం రేసులోనూ ఆర్.ఆర్.ఆర్. కు ఎంట్రీ లభించినా  అర్జెంటీనా సినిమాకు ఈ అవార్డు దక్కింది.

2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను ఏ ఆర్ రెహ్మాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *