Lord Rama- Shiva Dhanassu: రాముడు లీలగా విల్లందుకున్నాడు. అవలీలగా ఎక్కుపెట్టాడు. అంతే ఒక్కసారిగా భూనభోంతరాళాలాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫెళారావాలతో విరిగిపోయింది.
“తస్యశబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః”
ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్పశబ్దం వచ్చిందట. పర్వతాలు బద్దలయితే భూమి ఎలా అదురుతుందో అలా అదిరింది.
విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కినవారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారు.
ఈ సందర్భంలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు చక్కటి పదాలు వాడి ఆ సందర్భాన్ని ఎంత అద్భుతంగా మన కన్నుల ముందు ఆవిష్కరించారో చూడండి. ఆ పద్యం అర్ధం మనకు వెంటనే తెలియకపోయినా ! శబ్దచిత్రం మాత్రం కన్నుల ముందు ప్రత్యక్షమవుతుంది.
“నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జదుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్!”
ఇది మీ కనుల ముందు ఊహించండి!
నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైన మబ్బులలో అగ్నికణాల మాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మండమైన శబ్దంతో పిడుగులు అదేపనిగా ఒకదాని వెంట మరొకటి (series) గా వస్తే ఎలా ఉంటుందో…అలాంటి శబ్దం ఆ విల్లు విరిగి నప్పటి ఫెళఫెళారావాలు అంత తీవ్రంగా వచ్చాయట.
అంతేనా ఈ పద్యంలో ఇంకొక చమత్కారం కూడా వున్నది. రాముడు నీలమేఘశ్యాముడు ,”మేఘపటలీ నిర్గచ్చ “అని రాశాడాయన.
మేఘమండలం నుండి వెలువడిన అని అర్థం. నీలమేఘశ్యాముడి చేతిలో విరిగి అంత ధ్వని పుట్టిందట.
భాస్కర రామాయణంలోని పద్యమొకటి చూడండి.
“కులగిరులెల్ల బెల్లగిలె గుంభిని యల్లలనాడె దిగ్గజం
బులుబెదిరెన్ భుజంగపతి బొమ్మరవోయె బయోధులన్నియుం
గలగె దిగంతముల్ వగిలె గన్కనిదారలు రాలె సూర్యచం
ద్రుల గతులు తప్పె మేఘములు దూలె నజాండముమ్రోసె నయ్యెడన్”
ఆ శబ్దానికి పర్వతాలు పెళ్లగింపబడినవట. దిక్కులు మోసే ఏనుగులు బెదిరిపోయినవట. ఆదిశేషువుకు దిమ్మతిరిగి పోయిందట. సముద్రాలు క్షోభించినవట. భూమి అల్లల్లాడి పోయిందట. దిక్కులు పిక్కటిల్లినవట. నక్షత్రాలు రాలిపోయినవట. సూర్యచంద్రులు గతులు తప్పారట.
అంత భయంకరమైన శబ్దం పుట్టినదట.
ఒక్కక్క కవి ఊహా వైభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
-జానకిరామారావు
Also Read :
Also Read :