Goddess of three goddesses:
“అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్”
భాగవత ప్రారంభంలో దేవతాస్తుతిలో పోతన పద్యమిది. వేనవేల తెలుగు పద్యాల్లో ఆణిముత్యం లాంటి పద్యమిది. దుర్గా దేవి మెడలో అక్షరహారమయిన పద్యమిది. లోకంలో అమ్మలను కన్న అమ్మలందరికీ అక్షర హారతి పట్టిన పద్యమిది. పరాశక్తి రూపాన్ని పదహారణాల తెలుగు మాటల్లో బంధించిన పద్యమిది. తెలుగు మాటలను మంత్రమయం చేసి బీజాక్షరాలుగా మలచిన పద్యమిది. మహత్వ కవిత్వ పటుత్వ సంపద మనకు ఇచ్చిన పోతన మాత్రమే రాయగలిగిన పద్యమిది.
అర్థం:-
లక్ష్మి, పార్వతి, సరస్వతి- ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆది పరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపుకోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం. ఇంతకు మించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ… ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే-
మహత్వం – ఓం,
కవిత్వం- ఐం,
పటుత్వం- హ్రీమ్,
సంపద- శ్రీమ్
అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి- వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. “చాల పెద్ద” అద్భుతమయిన ప్రయోగం. సంస్కృతంలో “మహా శక్తి” అన్న మాటకు తెలుగు అనువాదం.
(విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి గుడిలో…
“అమ్మలగన్న అమ్మ…” పద్యాన్ని ఓ ఇత్తడిరేకుపై చెక్కించి…గర్భాలయం గుమ్మం పైన బిగించారు. ఆ ఆలోచన ఎవరిదోకానీ…వారి భక్తి సాహిత్య రసహృదయానికి పాదాభివందనం)
“శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!”
ఇది కూడా భాగవత ప్రారంభంలో పోతన చేసిన దేవతా స్తుతి పద్యం. తెలుపు స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. శరత్కాల తెల్లని మేఘాలు,
తెల్లని చల్లని చంద్రుడు,
పరిమళాలు వెదజల్లే తెల్లని పచ్చ కర్పూరం,
తెల్ల చందనం,
తెల్లటి హంస,
తెల్లని మల్లెల హారం,
తెల్లని మంచు,
తెల్లని నురగ,
తెల్లని వెండి కొండ,
తెల్ల రెల్లుగడ్డి,
తెల్లని ఆదిశేషుడు,
తెల్లని కొండమల్లె,
తెల్ల మందారం,
తెల్లని గంగ…
పోతన తలపుల్లో సరస్వతి తట్టగానే ఇన్ని తెలుపులు ఉపమాలంకారాలుగా ఆయన ఘంటం ముందు పోటీలు పడ్డాయి. ఇన్ని తెలుపుల అందాలను మించి వెలిగే సరస్వతిని మదిలో ఎప్పటికి చూస్తానో అన్నాడు పోతన. అంటే ఆయన చూడలేదని కాదు. మనం అలాంటి సరస్వతిని చూడాలంటే ఇలా అడగాలి. ఇలా ఊహించాలి. ఇలా ప్రసన్నం చేసుకోవాలి.
పోతన ఎక్కడ భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తాడో అని సాక్షాత్తు సరస్వతీ దేవి బాధపడి..ఆయన ముందు కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటే-
“కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!”
అని పోతన హామీ ఇచ్చాడంటారు.
(కాటుక కంటినీరు…పద్యం పోతనది కాకపోవచ్చు అన్న చర్చ పండితుల మధ్య చాలా కాలం జరిగింది. అది ఇక్కడ అనవసరం)
లక్ష్మి, పార్వతి, సరస్వతి- ముగ్గురిలో మూలమై ఉన్న దుర్గమ్మను తెలుగు సాహిత్యంలో బహుశా పోతన ఆవిష్కరించినంత అందంగా ఇంకెవరూ ఆవిష్కరించలేదు. శారదనీరదేందు…పద్యం అర్థం తెలియకపోయినా చదివినప్పుడు, పాడినప్పుడు, విన్నప్పుడు సాక్షాత్తు సరస్వతి దిగివచ్చి ఆశీర్వదించి వెళ్లాల్సిన పద్యం. తెలుగు పద్యం జిగి బిగి తెలిపే పద్యం. తెలుగు అందచందాలను పద్యాల్లో పోతపోసి…తెలుగు కవిత్వ పటుత్వ మహత్వ సంపదను నిర్వచించిన పద్యం.
(పాత వ్యాసం…కొన్ని చేర్పులతో)
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :