Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు వెలుగు

తెలుగు వెలుగు

Professionals- Telugu Literature: భాష ఒకరి సొత్తు కాదు. జనం సొత్తు. ప్రామాణిక భాష, మాండలిక భాష, కావ్య భాష…పేరేదయినా అది బతికేది జనం నోళ్ల మీదే. కృత్రిమంగా ఒక భాషను ఎవరూ పుట్టించలేరు. ఎంత చంపాలనుకున్నా జనం నోళ్లల్లో నానే భాషను ఎవరూ చంపలేరు.

తెలుగు భాషకు సంబంధించి ఇష్టంగా చదివి…భాషా శాస్త్రం, భాషోత్పత్తి శాస్త్రాలను అధ్యనం చేసిన, చేస్తున్నవారి సేవలు గొప్పవే. ఒక శాస్త్రంగా తెలుగును చదవకపోయినా అభిమానం కొద్దీ తెలుగులో మునిగితేలుతున్న ఇతర వృత్తులవారి సేవలు అనన్యసామాన్యం. వీరి మాతృభాష తెలుగు. కానీ చదువు, చేసే, చేసిన ఉద్యోగాలు తెలుగుకు సంబంధం లేనివి. నిజానికి ఇలాంటివారి వల్లే భాషకు మహోపకారం, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మూడు, నాలుగు దశాబ్దాలుగా ఇలా ఎందరినో గమనించాను. వారిలో కొందరు నా శ్రేయోభిలాషులు, కొందరు ఆత్మీయులు. నాకు తెలియనివారు ఇంకా ఎందరెందరో ఉంటారు. నాకు తెలిసినవారి గురించి, వారి తెలుగు వెలుగు గురించి నాలుగు మాటలు.

పోలీసు భాష

ఉమ్మడి రాష్ట్రంలో డి జి పి గా పనిచేసిన ఐ పి ఎస్ అధికారి కె. అరవిందరావు పేరు విననివారు ఉండరు. సంస్కృతం పి జి కూడా చేసి అద్వైత వేదాంతం మీద పి హెచ్ డి చేసిన లోతయిన సాహితీ పిపాసి ఆయన. నేను తెలుగు పద్యం చదువుతూ మరచిపోయిన పాదాలను ఆయన అందించేవారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు సాహిత్యాలను సమానంగా చదువుతూ ఉంటారు. మూడు భాషల్లో రాస్తూనే ఉన్నారు. పదవీ విరమణ తరువాత ఆధ్యాత్మిక విద్యా బోధనలో ప్రశాంత జీవనం గడుపుతున్నారు.

రావులపాటి సీతారామారావు ఖాకీ కలం చాలా ఫేమస్. ఐ పి ఎస్ అధికారిగా ఉంటూ చక్కటి తెలుగు వచనంలో ఆయన రాసిన రాతలు అత్యంత సరళంగా, అందంగా తెలుగు రాయాలనుకున్నవారికి పాఠం.

మస్తిపురం రమేష్ ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారి. తెలుగుకు ప్రాణమిస్తారు. వచన కవితలు, ఆధునిక పద్యాలు రాస్తారు.  సొంత ఖర్చుతో తెలుగు భాషాభిమానులతో ఇష్టాగోష్ఠులు నిర్వహించి భాషానందంలో ఉబ్బితబ్బిబ్బు అవుతుంటారు.

వైద్య భాష

డాక్టర్ కొచ్చెర్లపాటి జగదీష్ ఉత్తరాంధ్ర ప్రాంతవాసి. మంచి హస్తవాసిగల వైద్యుడు. సామాజిక మాధ్యమాల్లో ఈయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. హాస్యరసం పిండుతూ ఈయన రాసే తెలుగులో పదహారణాల తెలుగు పట్టు బట్టలు కట్టుకుని విలాసంగా ఊరేగుతూ ఉంటుంది. మీ రాతలో టెక్నిక్ ఏమిటో చెప్పండి సార్ అని నాలాంటివారెవరయినా అడిగితే…ఏదో ప్రాక్టీసింగ్ రైటర్ ను…అని అదో పెద్ద విషయం కానట్లు తేల్చేస్తారు. వైద్యుడిగా నిత్యం బిజీగా ఉంటూ ఆయన తెలుగు విద్యార్థిగా అంతే బిజీగా ఉంటారు.

ఒంగోలు వైద్యుడు మాచిరాజు రామచంద్రరావు తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుతుంటే వినడం ఒక యోగం. వయసులో నాకంటే పెద్దవారు. కానీ నేను పద్యాలు చదువుతుంటే చిన్నపిల్లాడై కేరింతలు కొడతారు. ఒక్కొక్క పద్యానికి ఒక వడ చేసి పెట్టు అని వైద్యురాలైన భార్యకు ఆదేశాలిస్తుంటారు. అంతర్జాతీయస్థాయి చిత్రకారుడు. సాహిత్య చర్చ ఉంటే చాలు…ఆయన నిద్రాహారాలు మరచిపోతారు.

హైదరాబాద్ యశోదాలో ఈ ఎన్ టీ వైద్యుడు శాస్త్రి సంస్కృత, తెలుగు ప్రేమకు కొలమానం లేదు. నాకు- ఆయనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కామన్ ఫ్రెండ్, శ్రేయోభిలాషి. ఆయన దగ్గరికి వైద్య పరీక్షలకు వచ్చినా సిరివెన్నెల గారు నాకు వీడియోకాల్ చేసి సాహిత్య చర్చ మొదలు పెట్టేవారు. అంత పెద్దాయన అలా మాట్లాడుతుంటే నన్ను నేను మరచి గాల్లో తేలిపోతూ ఉండేవాడిని. చెప్పిన పద్యాలే మళ్లీ మళ్లీ చెప్పించుకుని ఆయన శెభాష్ అంటుంటే నాకు ఒళ్లు తెలిసేది కాదు. ఆయనకు తెలిసిన పద్యాలే అవన్నీ. ఎక్కడ మంచి సాహిత్యం దొరికినా…ఎక్కడ మంచి మాట దొర్లినా…దాని మీద నాతో గంటలు గంటలు మాట్లాడే ఈ ఎన్ టీ శాస్త్రి గారిలో వైద్యుడి కన్నా భాషాభిమాని ఎక్కువగా ఉన్నాడు.

ఎందరో మహానుభావులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ముందు నేను పద్యాలతోనే మాట్లాడుతూ ఉంటాను. నేను ఎత్తుకున్న ప్రతి పద్యాన్ని ఆయన పూర్తి చేస్తూ ఉంటారు. భాష, వ్యాకరణం, మాండలికాల మీద లోతయిన అవగాహన ఉన్నవారు.

కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారిగా ఢిల్లీలో పనిచేస్తున్న విప్పగుంట రామ మనోహర తెలుగు వచనం రాస్తే శిల్పం చెక్కినంత అందంగా ఉంటుంది. ఏది రాసినా ముత్యాలు పేర్చినట్లు, రత్నాలు కూర్చినట్లు, మల్లెలు చల్లినట్లు, అత్తరు పూసినట్లు గొప్పగా ఉంటుంది. వచన కవితలో కూడా అందె వేసిన చేయి.

సినిమా నిర్మాత దిల్ రాజు సోదరుడు నరసింహా రెడ్డి అంటే ఆయన్ను తక్కువ చేసినట్లు అవుతుంది. తెలుగు ప్రేమికుడు. గేయసాహిత్యంలో అభినివేశం ఉన్నవారు. ఆధ్యాత్మిక, ప్రకృతి వ్యవసాయంలో ఉద్యమిస్తున్నవారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రతిక్షణం తపిస్తూ…తనవంతు ప్రయత్నం చేస్తున్నవారు.

ఇలా ఒకరు, ఇద్దరు కాదు.
తెలుగు ఎప్పటికీ చావదు అని రుజువు చేస్తున్నవారు…
తెలుగు ఆశలకు రెక్కలు తొడుగుతున్నవారు…
తెలుగు అక్షరాలను దోసిట్లో పట్టి ముందు తరాలకు అందిస్తున్న ఎందరో మహానుభావులు…
అందరికీ వందనాలు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

రైతుకు పట్టం

Also Read :

భాష వివస్త్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్