Tuesday, April 16, 2024

తగ్గేదే ల్యా

New Management Theory:  రామాయణ, భారత, భగవద్గీతల నుండి ఆదర్శాలు, మేనేజ్మెంట్ పాఠాలు, జీవన సూత్రాలు నేర్చుకునే రోజులు పోయాయి. సినిమాల్లో విలన్ లాంటి హీరోల అరాచక ప్రవర్తనల నుండి ఆదర్శాలను స్వీకరించే రోజులు వచ్చాయి. శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ప్రపంచ ప్రఖ్యాత ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే అడవిదుంగల దొంగను హీరోను చేసి సుకుమార్ అత్యంత సుకుమారంగా మన చెవిలో పెట్టిన “పుష్ప” ఇప్పుడు ఆసేతు హిమాచలం కలెక్షన్ల కాయలు కాచి, పండ్లు విరగ పండుతున్నాయి. భాషాభేదం లేకుండా అందరూ ఒక భుజాన్ని పైకి పెట్టి…ఎడమచేతిని గడ్డం కింద పెట్టి తగ్గేదే ల్యా అనే అంటున్నారు. పుష్ప పుట్టుక మొదటి పార్టే ఇది. పుష్ప వీర విహారం రెండో పార్ట్ లో చూడాలి. ప్రేక్షకుల అదృష్టం బాగుంటే మూడో పార్ట్ కూడా రావచ్చు.

పుష్పరాజం ఎర్రచందనం స్మగ్లర్ ఎరుకపరిచిన మేనేజ్మెంట్ పాఠాలు అని వాట్సాప్ యూనివర్సిటీలో ఇంగ్లీషు పి పి టి ఒకటి వైరల్ గా తిరుగుతోంది. దానికి కొంత తెలుగు పులిహోర కలిపిన పుష్పమిది!

1 . చదువెందుకు దండగ?
ఏనాడూ బడి మొహం చూడక పోయినా, అక్షరం ముక్క రాకపోయినా, ఎలాంటి సామాజిక అవగాహన లేకపోయినా పరవాలేదు. ఏదయినా చేయగలం అనే నమ్మకం ఉంటే చాలు.

2 . బృందాన్ని ముందుండి నడుపు
బృందంలో ఒకడిగా గుడ్డిగా నడవడం కాదు. బృందాన్ని ముందుండి నడిపించాలి. బృందానికి దారి చూపాలి. బృందం కోసం నిలబడు.

3 . తెగించు
పిరికి పిరికిగా ఉండకు. తెగించి బరిలో నిలబడి గెలవాలి. గెలుపు కోసం ఏదయినా చేయి. గెలిచి తీరాలనే కసి పెంచుకో. నీ గెలుపు క్రెడిట్ ను ఇంకొకరు కొట్టేయకుండా నువ్వే క్రెడిట్ మొత్తం తీసేసుకో.

4 . యజమానిలా ఆలోచించు
ఉద్యోగిలా ఆలోచిస్తూ నెల జీతం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూడకు. యజమానిలా లాభనష్టాల గురించి ఆలోచించు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించు. రిస్క్ తీసుకో. యజమానితో పార్ట్ నర్ అయిపో.

5 . గేమ్ రూల్స్ తెలుసుకో
మార్కెట్ విస్తృతి తెలుసుకో. మార్కెట్ విలువ తెలుసుకో. పోటీదారులను దాటి వెళ్లు. మధ్యలో బ్రోకర్లను దాటి అసలు కొనుగోలుదారుడిని పట్టుకో. బేరం పెట్టుకో. జాక్ పాట్ పట్టుకో. నిన్ను నీవు మార్కెట్ చేసుకో.

6 . వ్యాపారాన్ని పునర్నిర్మించు
తాతల నాటి వ్యాపారం పద్ధతులు, లాయల్టీ బంధాలు, నమ్మకాలు, తొక్కా తోలు…అన్నిటినీ ఛేదించు. కొత్త సప్లయ్ చెయిన్ నిర్మించు. సరుకు వెళ్లాలి. డబ్బు రావాలి. అన్నీ కుల్లం కుల్ల బరాబర్ కళ్ల ముందు కనపడే ఈజీ సప్లయ్ చెయిన్ నిర్మించు.

7 . లాభాలను పంచు
చేసేది స్మగ్లింగే అయినా లాభాలను పార్ట్ నర్ ల మధ్య అనుకున్న నిష్పత్తి ప్రకారం ధర్మంగా, న్యాయంగా, వేగంగా పంచు.

8 . ఉభయతారకం మోడల్
స్టేక్ హోల్డర్లు అందరికీ విన్- విన్ సిచుయేషన్ ఉండేలా ఉభయతారక మోడల్ అనుసరించు.

9 . బ్రాండ్
అన్నిటికంటే ముఖ్యమయినది బ్రాండ్. పుష్ప ఒక పేరు కాదు. అడవిలో ఎర్రచందనం మొహమే ఎర్రబారి, కొయ్యబారిపోయే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వ్యాల్యూ కోసం పెళ్లి ముహూర్తం దాటి పోతున్నా…ఎస్ పి తో కూర్చుని మందు తాగుతూ…ఎస్ పి తుపాకీతోనే చేతి వేళ్ల మధ్య కాల్చుకుని…రక్తం కారే వేళ్లకు కర్చీఫ్ కట్టుకుని…మంగళ సూత్రం కట్టడానికి వెళ్లాలి. ఎస్ పి ఒంటి మీద బట్టలు ఊడబెరికిన సాహసిగా పుష్ప బ్రాండ్ బాజా మోగిపోవాలి.

డిస్ క్లైమర్:
స్టాన్ఫోర్డ్ లు, హార్వర్డ్ లు చెప్పలేని ఈ పుష్ప పాఠాలను ప్రామాణికంగా తీసుకుని ఎవరయినా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దారులు పట్టి…ఒక భుజం పైకెత్తి…చెట్టులో చెట్టుగా…మట్టిలో మట్టిగా మిగిలిపోతే ఈ రచయిత పూచీ లేదు!

పుష్ప చూపే బంగారమాయెనే!
పుష్ప మాటే మాణిక్యమాయెనే!
పుష్ప నవ్వే నవరత్నమాయెనే!

ఇంతకూ మీరు-
ఊ అన్నారా?
ఊహూ అన్నారా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఇచ్చట వ్యూహాలు అమ్మబడును

RELATED ARTICLES

Most Popular

న్యూస్