కుల, మతాలకు అతీతంగా జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చదువుకుంటేనే బాగుపడతామని చెప్పిన మహనీయుడన్నారు. కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి 154 జయంతి సందర్భంగా మహబూబ్ నగర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వెంకట్రామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు. జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తని, ఆయన అందరివాడని పేర్కొన్నారు.
హైదరాబాదులో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి అనేకమంది రైతు కుటుంబాల, పేద విద్యార్థులకు విద్య అందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే అనేకమంది వసతి గృహాలు, భవన్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, పూలే, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులు సమ సమాజం కోసం పాటు పడ్డారన్నారు. వారి ఆశయాలు, భావజాలంతో పేదల కోసం సహాయపడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు.
సమాజం కోసం పాటుపడిన మహనీయులను కొన్ని కులాలు, మతాలకే పరిమితం చేయాలనుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకల్లో అన్నివర్గాలవారు పాల్గొనాలని కోరారు.