Monday, June 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశుభకృత్ సంవత్సర ఫలాలు

శుభకృత్ సంవత్సర ఫలాలు

‘Shubha’ krutham:  ఐ-ధాత్రి వీక్షకులందరికీ  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ ఏడు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతోంది, వారి ఆదాయ వ్యయాల సంగతేమిటి?  రాజ పూజ్యానికి అవకాశముందా? అన్నీ అవమాననేలా, గోచారం సంగతులేమిటి అనే పలు విశేషాలు మీ కోసం….

మేషం
ఆదాయం-14; వ్యయం-14
రాజపూజ్యం-3; అవమానం-6

గోచారం :
గురుడు 13.04.2022 వరకు 11వ ఇంట, తర్వాత సంవత్సరం చివరి వరకూ 12వ ఇంట.. రజతమూర్తిగానే సంచరిస్తాడు. శని 29.04.2022 వరకు 10వ ఇంట తామ్రమూర్తి, తర్వాత 12.07.2022 వరకు 11వ ఇంట లోహమూర్తి, ఆరోజు నుంచి 17.01.2023 వరకు వక్రగతిలో 10వ ఇంట రజతమూర్తి, తిరిగి సంవత్సరం చివరి వరకూ 11వ ఇంట లోహమూర్తిగా సంచరిస్తాడు. 12.04.2022 తర్వాత రాహువు ఒకటో ఇంట, కేతువు 7వ ఇంట రజతమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాలను బట్టి చూస్తే, గురుడు 28.04.2022 వరకే శుభుడు. శని సంవత్సరమంతా శుభుడు. రాహువు 20.02.2023 నుంచి శుభుడు, కేతువు 12.04.2022 నుంచీ శుభుడే.

శుభకృత్‌ సంవత్సరంలో గోచారాన్ని గమనిస్తే, మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషించడం వల్ల డబ్బుకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కార్యసాఫల్యానికి విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం శుభకార్యాల కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు అంతంత మాత్రంగానే ఉంటాయి. జీవిత భాగస్వామి వైఖరి తరచూ చికాకు పెడుతుంది. సంతానం కూడా మాట వినకపోవడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుండడం, వారికి జీవిత భాగస్వామి వత్తాసు ఆందోళన కలిగిస్తాయి. చెడు వ్యసనాల వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏ సందర్భంలోనైనా సౌమ్యంగా మాట్లాడడం, సర్దుకుపోవడం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ప్రమోషన్లు, ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. అదే సమయంలో ఒత్తిళ్లనూ ఎదుర్కొవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలోని వారు కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఎగుమతుల రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శని గోచారం కారణంగా, క్రమశిక్షణ అలవాటవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. శుభఫలితాల కోసం ఈరాశి వారు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం మంచిది.

***

వృషభం
ఆదాయం – 8 వ్యయం – 8
రాజపూజ్యం – 6 అవమానం – 6

గోచారం :
గురుడు 13.04.2022 వరకు 10వ ఇంట సువర్ణమూర్తి, ఈ తర్వాతి నుంచి 11వ ఇంట లోహమూర్తిగా సంచరిస్తాడు. శని 29.04.2022 వరకు 9వ ఇంట్లో రజతమూర్తి, 30వ తేదీ నుంచి 12.07.2022 వరకు 10వ ఇంట సువర్ణమూర్తి, తిరిగి 13వ తేదీ నుంచి 17.01.2023 వరకు, 9వ ఇంట లోహమూర్తిగా, అనంతరం 18వ తేదీ నుంచి 10వ ఇంట తామ్రమూర్తిగా సంచరిస్తాడు. రాహువు-కేతువులు 12.04.2022 నుంచి 12-6 రాశుల్లో లోహమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని బట్టి చూస్తే.. 28.04.2022 తర్వాతి నుంచి గురుడు పాపి. రాహు-కేతువులు కూడా సంవత్సరమంతా పాపులే. శని సంవత్సరమంతా శుభుడు.

శ్రమయేవ జయతే అన్న భావనే మీకు శ్రీరామ రక్ష. తలపెట్టిన పనులన్నింటా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ధన సంపాదన కూడా ఏమంత ఆశాజనకంగా ఉండదు. పైగా విపరీతమైన ఖర్చులు బాగా చికాకు పరుస్తాయి. శుభ కార్యాలను కూడా సవ్యంగా చేసే పరిస్థితి ఉండదు. ఈ తరుణంలో అత్యంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబం సౌఖ్యం కూడా అంత ఆహ్లాదంగా ఉండదు. జీవితభాగస్వామి, సంతానంతో తరచూ విభేదాలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి. ఈ సంవత్సరం అత్యధిక కాలం ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మాతృసమానులకు ఆపద గోచరిస్తోంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగాల్లోని వారు సర్దుకుపోయే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. నిరుద్యోగులు మూడింతలు శ్రమిస్తేనే ఫలితం దక్కేది. రాజకీయ రంగంలోని వారికి గడ్డు కాలం. శత్రువులదే పైచేయి అవుతుంది. ఈరాశి వారికి పదవులు ఊడిపోవడం, సస్పెన్షన్లు, ఆర్థిక ప్రయోజనాలకు భంగం వంటి చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి. వాహనాల క్రయవిక్రయాలు, విదేశీ ఉద్యోగాలు, ఎగుమతుల వ్యాపారాలు చేసే వారు జీవితంలో స్థిరపడే వీలుంది. విదేశీ విద్యకోసం చేసే ప్రయత్నాలు అనుకలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, అవమానాలు సమానంగా ఉంటాయి. స్థిరచిత్తంతో ముందుకు సాగితే, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఈరాశి వారు దోషనివారణ కోసం నిత్యం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

***

మిథునం
ఆదాయం – 11 వ్యయం – 5
రాజపూజ్యం – 2 అవమానం – 2


గోచారం :
గురుడు 13.04.2022 వరకు 9వ ఇంట లోహమూర్తి, ఆ తర్వాత సంవత్సరమంతా 10వ ఇంట తామ్రమూర్తి. శని 29.04.2022 వరకు 8వ ఇంట లోహమూర్తి, తర్వాత 12.07.2022 వరకు 9వ ఇంట తామ్రమూర్తి, తిరిగి 13వ తేదీ నుంచి 17.01.2023 వరకు 9వ ఇంట సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. రాహు కేతువులు 12.04.2022 నుంచి 11-5 రాశుల్లో తామ్రమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారం ప్రకారం, 13.04.2022 నుంచి గురుడు శుభుడు. శని 14.03.2023 వరకు శుభుడు. రాహువు సంవత్సరమంతా శుభుడే. కేతువు 17.10.2022 వరకు శుభుడు
ఇన్నాళ్ల కష్టం నుంచి కొద్దిగా గట్టెక్కగలుగుతారు. అయితే ప్రతి దానికోసమూ విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితం కూడా వెంటనే దక్కదు. ఈ సంవత్సరం ధనాదాయం కొద్దిగా మెరుగవుతుంది. ఖర్చులు అదుపు చేసుకోకపోతే చికాకులు, అప్పుల తిప్పలు తప్పవు. ఈ ఏడాది స్థిరాస్తులను సమకూర్చుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయినా జీవనశైలి మీరు కోరుకున్నట్లుగా ఉండకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సూటిపోటి మాటలు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తుంటాయి. చిన్నచిన్న ఎదురు దెబ్బలను కూడా తట్టుకోలేని మనోదౌర్భల్యం ఏర్పడుతుంది. కీలక కార్యాల నిమిత్తం  చేసే ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అపమృత్యు భయాన్ని అధిగమించేందుకు నిత్యం మృత్యుంజయ స్తోత్రాన్ని పటిస్తుండండి. కుటుంబ వాతావరణం మీరు ఆశించిన రీతిలో ఉండదు. జీవిత భాగస్వామి వైఖరి, సంతానం పెడధోరణులు ఆందోళన కలిగిస్తాయి. పితృదోషాల నివారణకు ప్రయత్నించండి. కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా.. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభించడం పెద్ద ఊరటనిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారు మరింత శ్రద్ధతో మెలగాలి. నిరుద్యోగుల శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు. రాజకీయ రంగంలోని వారు అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. విద్యార్థులు మేలిమి పలితాల కోసం ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. నిత్యం శివారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం వల్ల పరిస్థితులు సానుకూలమయ్యే వీలుంది.

***

కర్కాటకం
ఆదాయం – 5 వ్యయం – 5
రాజపూజ్యం – 5 అవమానం – 2

గోచారం :
గురుడు 13.04.2022 వరకు 8వ ఇంట సువర్ణమూర్తి , తర్వాత సంవత్సరమంతా 9వ ఇంట రజతమూర్తి. శని 29.04.2022 వరకు 7వ ఇంట సువర్ణమూర్తి, ఆ తర్వాత 12.07.2022 వరకు 8వ ఇంట రజతమూర్తి, ఆ తర్వాత 17.01.2023 వరకు 7వ ఇంట సువర్ణమూర్తిగాను, అనంతరం 18వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు 8వ ఇంట రజతమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 నుంచి 10-4 రాశుల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారం బట్టి, గురుడు 13.04.2022 తర్వాత పాపి. శని కూడా సంవత్సరమంతా పాపి. రాహు-కేతువులు సంవత్సరం మొత్తంగా శుభులే.

శుభకృత్‌ నామ సంవత్సరం అనుకూల ఫలితాలనిస్తుంది. కోరుకున్నవి సిద్ధిస్తాయి. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వాహనాలు కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తరచూ బంధువులను కలుస్తూ విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. ఒకరోజు సౌఖ్యంగా.. మరోరోజు చికాకుగా సాగుతుంది. జీవిత భాగస్వామి వైఖరి మిమ్మల్ని సమాజంలో చులకన చేస్తుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. అయితే వారి గురించిన చేదువార్తలు వినాల్సి రావచ్చు. మిత్రులకు దూరమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎవరికీ పూచీకత్తు ఉండకండి. వాత సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే వీలుంది. పశు సంబంధ వృత్తి, వ్యాపారాల్లోని వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలోని వారు మానసిక స్థిరత్వాన్ని కోల్పోవడం వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీరికి ఉన్నత పదవులు గోచరిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సౌమ్యంగా ఉంటూ అందరినీ కలుపుకు పోగలిగితే, ఇన్నాళ్లూ పడ్డ కష్టాలు తొలగి, కాలం సుఖమయంగా సాగుతుంది. మేలిమి ఫలితాలకోసం ఈరాశివారు తరచూ శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

***

సింహం
ఆదాయం – 8 వ్యయం – 14
రాజపూజ్యం – 1 అవమానం – 5

గోచారం :
గురుడు 13.04.2022 తర్వాత సంవత్సరమంతా 8వ ఇంట సువర్ణమూర్తి. శని 29.04.2022 వరకు ఆరింట సువర్ణమూర్తి, తర్వాత 12.07.2022 వరకు ఏడింట లోహమూర్తి, ఆ తర్వాత 17.01.2023 వరకు ఆరింట రజతమూర్తిగా ఉంటాడు. 2023 జనవరి 18 తర్వాత ఏడింట లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 తర్వాత 9-3 ఇళ్లలో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని గమనిస్తే, గురుడు సంవత్సరమంతా పాపి. శని 12.07.2022 నుంచి 17.01.2023 వరకు పాపి. రాహు-కేతువులు సంవత్సరమంతా శుభులే.

సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నవి సాధించుకోగలుగుతారు. శ్రీకారం చుట్టిన ప్రతి పనీ.. ఎన్నో ఆటంకాలను అధిగమించాకే ఫలిస్తుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది. మితిమీరిన ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్థిరాస్తులను అమ్మే పరిస్థితి రావచ్చు. తొందరపడి ఎవరికీ హామీ ఉండకండి. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ దశలో కష్టాలన్నీ చుట్టుముట్టిన భావన కలుగుతుంది. దీనికి తోడు పెద్దల ఆగ్రహం మరింత ఆందోళన కలిగిస్తుంది. మనసును నియంత్రించుకోవాలి. మాట తూలకుండా చూసుకోవాలి. అండగా ఉంటారనుకున్న బంధుమిత్రులు ముఖం చాటేయడం నిరాశను కలిగిస్తుంది. మీ శత్రువులు మాత్రం ఎప్పటికైనా మీరు విజృంభిస్తారన్న భయంతో.. మీ వ్యవహారాల్లో నేరుగా తలదూర్చరు. పరోక్షంగా మీ గురించి దుష్ప్రచారం చేస్తూ చిక్కులు తెస్తుంటారు. కీలక ప్రయాణాలేవీ లాభించే పరిస్థితి లేదు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే సూచనలున్నాయి. కుటుంబ సౌఖ్యానికి లోటు లేకున్నా,  అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. సంతానం వృద్ధిలోకి వచ్చే ప్రయత్నాలు ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల విషయంలోఅత్యంత జాగ్రత్తగా ఉండాలి. విధి నిర్వహణలో ఏమరుపాటుగా ఉంటే భారీ నష్టం తప్పదు. నిరుద్యోగులు బాగా శ్రమించాలి. రాజకీయ రంగంలోని వారు నిందలపాలై, పదవులు కోల్పోయే సూచనలున్నాయి. ఆర్థిక, వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తే ఇబ్బందులను అధిగమించే వీలుంది. సింహరాశి వారు తరచూ సాయినాథుని, గౌరీదేవిని పూజించడం వల్ల ప్రతికూలతలు తగ్గే వీలుంది.

***

కన్య
ఆదాయం – 11 వ్యయం – 5
రాజపూజ్యం – 4 అవమానం – 5

గోచారం :
గురుడు 13.04.2022 వరకు ఆరింట రజతమూర్తి, ఆ తర్వాత సంవత్సరం చివరి వరకు ఏడింట లోహమూర్తి. శని 29.04.2022 వరకు ఐదో ఇంట్లో రజతమూర్తిగాను, నాటి నుంచి 12.07.2022 వరకు ఆరింట తామ్రమూర్తిగాను, అప్పటి నుంచి 17.01.2023 వరకు తిరిగి ఐదింట లోహమూర్తిగాను, అనంతరం సంవత్సరం చివరి వరకు ఆరింట తామ్రమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 తర్వాత 8-2 రాశుల్లో లోహమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని బట్టి గురుడు సంవత్సరమంతా పాపి. శని-రాహువులు సంవత్సరమంతా శుభులు. కేతువు 17.10.2022 వరకు శుభుడు.

ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదట్లో కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉన్నా, రాను రాను పరిస్థితులు అనుకూలిస్తాయి. కీలకమైన పనుల విషయంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే పెద్దస్థాయిలో ఎదురు దెబ్బ తినే వీలుంది. మీ ఎదుగుదలను సహించలేని వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. పెద్దల అండదండలతో గడ్డు కాలాన్ని అధిగమిస్తారు. పనులనూ సానుకూలం చేసుకోగలుగుతారు. ఆదాయానికి రెట్టింపు ఖర్చులుంటాయి. అవసరానికి అప్పులు చేయాల్సి రావచ్చు. ఇంటికి కావాల్సిన వస్తువులను సమకూర్చుకుంటారు. మనసు స్థిమితంగా లేనందు వల్ల ఆత్మీయులతోనే గొడవలకు దిగుతారు. కొన్ని సందర్భాల్లో కోర్టులకూ వెళ్లాల్సి వస్తుంది. స్థిర, చరాస్తులను కోల్పోయే సూచనలున్నాయి. చెప్పుడు మాటలు వినకపోవడం, సౌమ్యగుణంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. తీర్థయాత్రలకు వెళ్లే సూచనలున్నాయి. ముఖ్యమైన ప్రయాణాలు ఆశించిన ఫలితాలనివ్వవు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం. వృత్తి ఉద్యోగాల్లోని వారు అనవసర గొడవలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు ఆశించిన ఫలితం కోసం విపరీతంగా శ్రమించాలి. రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఈరాశి వారు వీలు కల్పించుకుని, తరచూ నవగ్రహారాధాన, ఆంజనేయస్వామి పూజ చేస్తుంటే, పరిస్థితులు కొద్దిగా అనుకూలిస్తాయి.

***

తుల
ఆదాయం – 8 వ్యయం – 8
రాజపూజ్యం – 7 అవమానం – 5

గోచారం :
గురుడు 13.04.2022 తర్వాత సంవత్సరమంతా ఆరింట సువర్ణమూర్తిగా సంచరిస్తాడు.  శని 29.04.2022 వరకు నాలుగో రాశిలో (అర్ధాష్టమంలో) తామ్రమూర్తిగా, అప్పటినుంచి 12.07.2022 వరకు ఐదింట సువర్ణమూర్తిగాను, తిరిగి అర్ధాష్టమంలో 17.01.2023 వరకు తామ్రమూర్తిగాను, 2023 జనవరి 18 నుంచి ఐదింట రజతమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువుల 12.04.2022 నుంచి సంవత్సరమంతా 7-1 రాశుల్లో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని పరిశీలిస్తే, గురు, కేతువులు సంవత్సరమంతా పాపులే. శని సంవత్సరమంతా శుభుడు. రాహువు 12.04.2022 నుంచి శుభుడు.

శుభకృత్‌ నామ సంవత్సరంలో పనుల పూర్తి కోసం కాస్తంత ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవసరానికి అప్పులు చేసే పరిస్థితి గోచరిస్తోంది. ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయం చేయాలనుకుంటారు. ఈ రాశివారికి శుభకృత్తులో దాయాదుల పోరు ఎక్కువగా ఉంటుంది. రుణాలు, రోగాలు బాగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పరంగా ఉదర సంబంధ సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా సంతానం మీకు దూరంగా ఉంటుంది. అనైతిక సంబంధాల వ్యవహారం కుటుంబంలో చిచ్చు రేపే వీలుంది. సంతానాభిలాషులకు శుభం చేకూరుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. తరచూ విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బంధువుల్లో ముఖ్యుల గురించిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో డబ్బులు నష్టపోతారు. ముఖ్యంగా సొంతంగా వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు లక్ష్యసాధన కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. రాజకీయ రంగంలోని వారు నిందలు పడాల్సి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరాశి వారు తరచూ నవగ్రహారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం వల్ల గడ్డు పరిస్థితులు ఉపశమించే వీలుంది.

***

వృశ్చికం
ఆదాయం – 14 వ్యయం – 14
రాజపూజ్యం – 3 అవమానం – 1

Shubhakruth Nama Samvatsara

గోచారం :
గురుడు 13.04.2022 వరకు నాలుగింట తామ్రమూర్తి, నాటి నుంచి సంవత్సరం చివరి వరకు ఐదింట తామ్రమూర్తిగా సంచరిస్తాడు. శని.. 29.04.2022 వరకు మూడింట తామ్రమూర్తిగాను, నాటి నుంచి 12.07.2022 వరకు నాలుగో ఇంట రజతమూర్తిగాను, ఆరోజు నుంచి తిరిగి 17.01.2023 వరకు మూడింట సువర్ణమూర్తిగాను, ఆరోజు తర్వాత నాలుగో ఇంట మళ్లీ సువర్ణమూర్తిగాను సంచరిస్తాడు.
రాహు-కేతువులు 12.04.2022 తర్వాత 6-12 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని బట్టి గురుడు సంవత్సరమంతా పాపి. శని సంవత్సరమంతా శుభుడు. రాహు-కేతువులు 12.04.2022 నుంచి పాపులు.

యోగదాయకంగా ఉంటుంది. ఇన్నాళ్ల కష్టం తీరిపోనుంది. పనులన్నీ అనుకూలంగా ఉంటాయి. డబ్బుకి ఇబ్బంది తొలగిపోతుంది. ఆస్తులు కొనే ప్రయత్నం ఫలిస్తుంది. శుభకార్యాల కోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారు. లగ్జరీ జీవితం గడుపుతారనే చెప్పాలి. మీ ఎదుగుదల బంధువర్గానికి కంటగింపుగా ఉంటుంది. మిమ్మల్ని చులకన చేసేందుకు ప్రయత్నిస్తారు. మిత్రుల సహకారంతో మీరెంచుకున్న రంగంలో వృద్ధి చెందుతారు. జీవితంలో స్థిరపడే క్రమంలో పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులను అమ్మే వీలుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు చికాకు పెడతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణాలకు అనుకూల కాలమిది. మానసికంగా ఉల్లాసంగా ఉన్నా, కొన్ని సుఖాలకు దూరమయ్యే పరిస్థితి ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల్లో ముఖ్యమైన వారి గురించి చేదువార్తను వింటారు. సంతానం మీరు కోరుకున్న రీతిలోనే వృద్ధిలోకి వస్తుంది. సంతానాభిలాషుల కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ఈ సంవత్సరం ఏమంత అనుకూలంగా లేదు. తరచూ అధికారుల ఆగ్రహానికి గురవుతుంటారు. ఈ నిరుద్యోగులు శుభవార్తను అందుకుంటారు. సంవత్సరం విద్యార్థులు బాగా రాణిస్తారు. రాజకీయ రంగాల్లోని వారికి శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రాశివారు మరింత మేలిమి ఫలితాల కోసం.. వీలైనంత తరచుగా సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం

***

ధనుస్సు
ఆదాయం – 2 వ్యయం – 8
రాజపూజ్యం – 6 అవమానం – 1

Shubhakruth Nama Samvatsara

గోచారం :
గురుడు 13.04.2022 తర్వాత సంవత్సరమంతా నాలుగింట రజతమూర్తిగా సంచరిస్తాడు. శని 29.04.2022 వరకు రెండో ఇంట్లో రజతమూర్తిగాను, ఆరోజు నుంచి 12.07.2022 వరకు మూడో ఇంట్లో లోహమూర్తిగాను, ఆరోజు నుంచి 17.01.2023 వరకు మళ్లీ రెండో ఇంట్లో సువర్ణమూర్తిగాను సంచరిస్తాడు. 2023 జనవరి 18వ తేదీ మొదలు సంవత్సరమంతా మూడో ఇంట్లో లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 తర్వాత సంవత్సరమంతా 5-11 రాశుల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారం మేరకు గురుడు 13.04.2022 నుంచి శుభుడు. శని-కేతువులు సంవత్సరమంతా శుభులు. రాహువు 20.02.2023 వరకు శుభుడు. అనంతరం పాపిగా అవుతాడు.

గ్రహగతులను బట్టి చూస్తే, ధనూరాశి వారిని వేధిస్తోన్న కష్టాలు తొలగిపోతున్నట్లే చెప్పాలి. నిరుటి కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. తెలివితేటలకు పదును పెడతారు. కార్యాలను సానుకూలం చేసుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ధనాదాయం మెరుగవుతుంది. విలాసమయ జీవితం గడుపుతారు. వ్యర్థపు ఖర్చులు అదుపు చేసుకుంటే, స్థిరాస్తులను కూడబెట్టే యోగం కనిపిస్తోంది. నూతన వాహనంకొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి తోడ్పాటు లభించక పోవడం ఆవేదనను కలిగిస్తుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి మీద ఓ కన్నేసి ఉంచండి. ఇలాంటి వారి చర్యలతో పాటు, మిమ్మల్ని దెబ్బతీయాలనుకునే మీ శత్రువుల ఎత్తుగడలు కూడా మీకే అనుకూలిస్తాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలా చేస్తే మళ్లీ పాత కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. జీవిత భాగస్వామి తోడ్పాటుతో సర్వత్రా విజయాలు సాధిస్తారు. సంతానం మీరు అనుకున్నట్లే వృద్ధిలోకి రావడం మీకు అమితానందాన్నిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఎన్నికల్లో పోటీ వంటి అంశాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫలితం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ధర్మమార్గంలో జరిపే రెండో పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఉద్యోగ భద్రతకే ముప్పు రావచ్చు. రాజకీయ రంగంలోని కీలక పదవుల్లోని వారికి గడ్డు పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఈ రాశి వారు తరచూ గణపతి, నవగ్రహారాధనల వల్ల మరిన్ని మేలిమి ఫలితాలు పొందగలుగుతారు.

***

మకరం
ఆదాయం – 5 వ్యయం – 2
రాజపూజ్యం – 2 అవమానం – 4

గోచారం :
గురుడు 13.04.2022 తర్వాత సంవత్సరమంతా మూడింట లోహమూర్తిగా సంచరిస్తాడు. శని 29.04.2022 వరకు జన్మరాశిలో సువర్ణమూర్తిగాను, నాటి నుంచి 12.07.2022 వరకు రెండో ఇంట్లో తామ్రమూర్తిగాను, తిరిగి ఆరోజు నుంచి 17.01.2023 వరకు జన్మరాశిలో లోహమూర్తిగా సంచరిస్తాడు. 2023 జనవరి 18 మొదలు సంవత్సరమంతా రెండో ఇంట సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 తర్వాత సంవత్సరమంతా 4-10 ఇళ్లలో లోహమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారానుసారం గురుడు 24.02.2023 వరకు శుభుడు. శని 29.04.2022 నుంచి 12.07.2022 వరకు, తిరిగి 17.01.2023 నుంచి సంవత్సరమంతా పాపి. రాహు-కేతువులు సంవత్సరమంతా శుభులే.

గోచారాన్ని బట్టి చూస్తే మకర రాశివారు, ఈ సంవత్సరం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ప్రతి పనికీ విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులన్నింటికీ ఆటంకాలు ఎదురవుతాయి. అవసరాలకు సరిపడా డబ్బు లేక తరచూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సౌకర్యాలను సమకూర్చుకోవాలన్న ప్రయత్నాలు అనుకూలించవు. అత్యవసర కాలంలో సరైన నిర్ణయం తీసుకోలేక నష్టపోతారు. శత్రువులు మీమీద పైచేయి సాధిస్తారు. అనుక్షణం వారి కదలికలను కనిపెట్టుకుని ఉండండి. చిరాకులో ఆత్మీయులతోనూ గొడవ పడే పరిస్థితి ఉంది. బంధుమిత్రులు మీకు దూరం జరిగే సూచనలున్నాయి. చేయని తప్పునకు నిందలు భరించాల్సి వస్తుంది. జరుగుతున్న పరిణామాలు ఆందోళనను కలిగిస్తాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉదర సంబంధ సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఇష్టంలేని బదిలీలుండే వీలుంది. ఉన్నతాధికారుల వేధింపులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు లక్ష్యసాధన కోసం విపరీతంగా శ్రమించాలి. రాజకీయ రంగంలోని వారికి విపరీతమైన ఒడుదుడుకులు ఉంటాయి. సహనం కోల్పోకండి. వ్యాపార రంగంలోని వారికి కూడా నష్టాలు, జరిమానాలు సాధారణమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాట నిలుపుకోలేక పోవడం వల్ల కోర్టు, జైలును సందర్శించే ప్రమాదం ఉంది. పొరపాటున కూడా ఎవరికీ హామీ ఇవ్వకండి. జీవిత భాగస్వామికి దూరమైన వారు రెండో పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరాశి వారు తరచూ నిత్యం శివారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

***

కుంభం
ఆదాయం – 5 వ్యయం – 2
రాజపూజ్యం – 5 అవమానం – 4

గోచారం :
గురుడు 13.04.2022 తర్వాత సంవత్సరమంతా రెండో ఇంట లోహమూర్తిగా సంచరిస్తాడు. శని 29.04.2022 వరకు పన్నెండో ఇంట లోహమూర్తిగాను, అప్పటి నుంచి 12.07.2022 వరకు జన్మరాశిలో రజతమూర్తిగాను, ఆ తర్వాత 17.01.2023 వరకు తిరిగి పన్నెండో ఇంట సువర్ణమూర్తిగాను, అది మొదలు సంవత్సరమంతా జన్మరాశిలో తామ్రమూర్తిగాను సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 మొదలు సంవత్సరమంతా 3-9 రాశుల్లో తామ్రమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని బట్టి 24.02.2023 వరకు గురుడు పాపి. ఆతర్వాత నుంచి శుభుడు. శని 14.03.2022 వరకు పాపి. రాహు-కేతువులు సంవత్సరమంతా శుభులు

ఆలోచనలు వక్రమార్గం పట్టకుండా చూసుకోండి. తలపెట్టిన పనుల పూర్తికి విపరీతంగా శ్రమించాలి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. అనూహ్యంగా వచ్చిపడే ఖర్చుల వల్ల పొదుపు చేయాలన్న ఆలోచన సఫలం కాదు. వస్తు వాహనాలు కొనేందుకు అప్పులు చేయాల్సి రావచ్చు. పనులపై ఏకాగ్రత ఉండదు. అవసర కాలంలో మీ తెలివితేటలు ఉపకరించవు. స్థిరచిత్తం లేని కారణంగాను, ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చడం వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయి. మీ పనులకు బంధు మిత్రుల నుంచి వ్యతిరేకత వస్తుంది. వారితో తరచూ వాగ్వాదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యక్తిగత శత్రువులు, దాయాదులు రెచ్చిపోయే వీలుంది. ఏదో రూపంలో ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాట తూలడం కారణంగా శిక్షకు గురయ్యే సూచనా ఉంది. అన్ని సందర్భాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం రాకుండా చూసుకోవాలి. కుంభరాశి వారు ప్రయాణాల్లో.. ముఖ్యంగా సొంతంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఇంటి సభ్యుల నిర్ణయాలు మీకేమాత్రం నచ్చని కారణంగా వారితో గొడవలు పడే వీలుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తలనొప్పిని తెచ్చిపెడతాయి. ఈరాశి వారు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి అంతంత మాత్రపు వృద్ధే ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి విపరీతమైన శ్రమ, అనవసరమైన ప్రయాణాలు అలసటను తెస్తాయి. వీరు సౌకర్యాలను కోల్పోయి సౌఖ్యానికి దూరం కావాల్సి వస్తుంది. కుంభరాశి వారు నిత్యం పార్వతీపరమేశ్వరులతో పాటుగా, నవగ్రహాలను ఆరాధించడం మంచిది.

***

మీనం
ఆదాయం – 2 వ్యయం – 8
రాజపూజ్యం – 1 అవమానం – 7

Shubhakruth Nama Samvatsara

గోచారం :
గురుడు 13.04.2022 తర్వాత సంవత్సరమంతా జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. శని 29.04.2022 వరకు 11వ స్థానంలో సువర్ణమూర్తిగాను, 12.07.2022 వరకు పన్నెండో ఇంట్లో సువర్ణమూర్తిగాను, నాటి నుంచి 17.01.2023 వరకు 11వ ఇంట్లో తామ్రమూర్తిగాను సంచరిస్తాడు. 18వతేదీ మొదలు సంవత్సరమంతా పన్నెండో ఇంట్లో రజతమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు 12.04.2022 తర్వాత 2-8 రాశుల్లో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు.

వేధ గోచారాన్ని బట్టి గురుడు సంవత్సరమంతా పాపి. శని 14.03.2023 వరకు శుభుడు. రాహు-కేతువులు సంవత్సరమంతా శుభులే.

మీనరాశి వారికి గోచార రీత్యా పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. అన్నిరంగాల్లోనూ వృద్ధి గోచరిస్తోంది. సంఘంలో హోదా పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో చేపట్టిన పనుల్లో సంపూర్ణ విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేసే సూచనలున్నాయి. వ్యాధుల బెడద తొలగిపోతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. తలపెట్టిన పనిని చేపట్టే ముందు ఆచితూచి ఆలోచించి, సరైనది అనిపించాకే రంగంలోకి దిగండి. హడావుడి నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరుస్తారు. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీలక ప్రయాణాలు లాభదాయకం కావు. సోదరులతో ఇబ్బందులు రావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లోని వారికి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతి అడుగూ అప్రమత్తంగా వేయాలి. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. రాజకీయ రంగంలోని వారికి హోదా పెరగడంతో పాటు, తొందరపాటు నిర్ణయాల వల్ల పదవీచ్యుతికి గురయ్యే సూచనలున్నాయి. బయటపడని శత్రువులపైన కన్నేసి ఉంచండి. వారి వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినే వీలుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి, సంతానానికి అనారోగ్య సూచనలున్నాయి. మీనరాశి వారు ఈఏడాది గాయత్రీమాత, నవగ్రహారాధానల వల్ల మేలిమి ఫలితాలు పొందే వీలుంది.
శుభం భూయాత్

గమనిక :
శుభకృత్‌ సంవత్సరంలో గ్రహాల స్థూల సంచారాన్ని, వివిధ రాశుల పై ఆయా గ్రహాల స్థితి, యుతి, వీక్షణ సంబంధాల ప్రభావాన్ని అంచనా వేసి రాసిన ఫలితాలివి. వ్యక్తిగతమైన ఫలితాల కోసం, మీ జన్మకుండలి ద్వారా, నడుస్తున్న దశ, అంతర్దశలను, గోచారంతో బేరీజు వేసుకుని నిర్దిష్టమైన ఫలితాలు తెలుసుకోగలరు.

శుభం భూయాత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్