కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని రేవంత్ చేసిన ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం కాదని మహేందర్ రెడ్డి తేల్చిచెప్పారు. భుజానికి గాయమైనందుకే సెలవు..
ఇటీవల తన ఇంట్లో తాను జారిపడటంతో ఎడమ భుజానికి గాయమైందని డీజీపీ తెలిపారు. భుజంపైన మూడు చోట్ల ఫ్యాక్చర్స్ అయినట్లు ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టులలో తేలింది. దీంతో భుజం కదలకుండా కట్టు కట్టారు వైద్యులు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరడం జరుగుతుందన్నారు. భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడడం జరుగుతోందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడంపట్ల మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని డీజీపీ పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉందన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్తైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తాయన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయమనం పాటించాలని డీజీపీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *