టాలీవుడ్ లో చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలంతా బరిలోనే ఉన్నారు. మరో వైపున ప్రభాస్ .. ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ వంటి స్టార్ హీరోలు మంచి దూకుడు మీద ఉన్నారు. అంతకుముందు తెలుగు తెరపై ఉత్తరాది విలన్స్ హవా నడిచింది. ప్రకాశ్ రాజ్ వచ్చిన తరువాత పరభాషా విలన్స్ ను గురించిన ఆలోచన ఎవరికీ రానీయలేదు. అంతగా ఆయన చుట్టబెట్టాడు. ఇక్కడ అందరి హీరోలకు తానే విలనై నడిపించాడు.
ప్రకాశ్ రాజ్ ఫుల్ బిజీ .. ఆయన కోసం ఎంతకాలం వెయిట్ చేయడం? మరో మార్గం లేదా? అని అంతా ఆలోచన చేస్తుండగా, రావు రమేశ్ రంగంలోకి దిగాడు. ఆరంభంలో చిన్న సినిమాలలో .. చిన్న హీరోలతో తలపడిన ఆయన, స్టార్ హీరోల సినిమాల స్థాయికి చేరుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక మరో వైపున విలన్ గా టర్న్ తీసుకున్న జగపతిబాబు, గ్రామీణ స్థాయి నుంచి కార్పొరేట్ విలనిజం వరకూ తన సత్తా చాటడం మొదలెట్టారు.
ఈ ముగ్గురి విలనిజం మూడుదారుల్లో సాగుతుండగా, కోలీవుడ్ నుంచి సముద్రఖని ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ఆయన తమిళ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. చూడటానికి సముద్రఖని చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. చురుకైన చూపులు .. తక్కువ డైలాగ్స్ తోనే భయపెట్టే విలనిజం ఆయనకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘సార్’ రేపు థియేటర్లకు వస్తోంది. ఈ సినిమాలోను ఆయన పవర్ఫుల్ ప్రతినాయకుడే. చూస్తుంటే టాలీవుడ్ లో సముద్రఖని మరింత బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.