Saturday, November 23, 2024
HomeTrending Newsగుజరాత్‌ కు సెమీకండక్టర్ ప్లాంట్...మహారాష్ట్రలో దుమారం

గుజరాత్‌ కు సెమీకండక్టర్ ప్లాంట్…మహారాష్ట్రలో దుమారం

సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ గుజరాత్ కు తరలిపోవటంపై శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకనాథ్ షిండే అసమర్థత వల్లే ఈ ప్లాంట్ మహారాష్ట్రకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ ను మహారాష్ట్రకు తీసుకువచ్చేందుకు గతంలో పరిశ్రమల మంత్రిగా ఉన్న సుభాష్ దేశాయ్ తాను ఎంతో కృషి చేశామన్నారు. చివరి దశలో షిండే ప్రభుత్వం పట్టించుకోక పోవటం వల్లే గుజరాత్ వెళ్ళిపోయిందని విమర్శించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం, మహారాష్ట్ర శ్రేయస్సు కోసం ఏకనాథ్ షిండే ప్రభుత్వం పనిచేయాలని ఆదిత్య థాకరే హితవు పలికారు.

అదిత్యనాత్ థాకరే ఆరోపణలతో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. ఏకనాథ్ షిండే తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మహారాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది ఇలా ఉండగా మనదేశంలో తొలి సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ గుజరాత్‌లో ఏర్పాటు కానుంది. మైనింగ్ కంపెనీ వేదాంత, తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్ కలిసి గుజరాత్‌లో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకోసం రూ.1.54 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం గుజరాత్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. అహ్మదాబాద్ సమీపంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. రెండేళ్లలో ఇక్కడ చిప్‌ల తయారీ ప్రారంభం కానుంది. ఈ చిప్ తయారీ ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కార్పొరేట్ పెట్టుబడి అని గుజరాత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ నెహ్రా తెలిపారు. గుజరాత్ తరఫున ఎంఓయూపై ఆయనే సంతకాలు చేశారు. భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ దిశగా ఇదో కీలక ముందుడగు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సెమీకండక్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం ఆర్థికంగా, ఆర్థికేతరంగా అనేక రకాలుగా ఇన్సెంటివ్స్ అందించనుంది. మనదేశంలో సెమీకండక్టర్ పాలసీ ఉన్న ఏకైక రాష్ట్రం గుజరాత్ కావడం గమనార్హం. సెమీకండక్టర్ ప్లాంట్‌ను దక్కించుకోవడం కోసం గుజరాత్‌తో మహారాష్ట్ర చివరి వరకూ పోటీ పడింది. కానీ వేదాంత గ్రూప్ ప్రధాని సొంత రాష్ట్రం వైపు మొగ్గు చూపింది.

 

సెమీకండక్టర్ చిప్‌లను కార్లు, ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ 2021 నాటికి 27.2 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2026 నాటికి ఇది 64 బిలియన్ డాలర్లకు చేరనుంది. కానీ ఇప్పటి వరకూ సెమీకండక్టర్లను మనదేశంలో ఉత్పత్తి చేయడం లేదు.

ప్రపంచంలో సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రస్థానంలో తైవాన్ ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా, జపాన్ ఉన్నాయి. గుజరాత్ ప్లాంట్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తి మొదలైతే.. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. గత ఏడాది సెమీకండక్టర్ల కొరత కారణంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌తోపాటు పలు రంగాలపై ప్రభావం పడింది.

మన దేశంలో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మూడో కంపెనీ వేదాంత. ఇంతకు ముందు అంతర్జాతీయ కన్సార్టియం ఐఎస్ఎంసీ కర్ణాటకలో, సింగపూర్‌కు చెందిన ఐజీఎస్ఎస్ వెంచర్స్ తమిళనాడు చిప్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి.

మన దేశంలో 70 వేల స్టార్టప్‌లు ఉండగా.. అందులో 100 యూనికార్న్‌లు (100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన కంపెనీలు) ఉన్నాయి.. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ కేంద్రంగా భారత్ నిలిచింది. మన దేశంలో ఏటా దాదాపు రూ.6 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రూ.25 లక్షల కోట్ల స్థాయికి చేర్చాలని ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్