ఊరంటే నాలుగు వీధులు, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి జడపదార్థాలు కాదు. ఊరంటే మనుషులు, వారు నడిచిన దారులు, నిర్మించిన వ్యవస్థలు, నిలిపిన విలువలు, మిగిల్చిన జ్ఞాపకాలు. ఆకోణంలో కొన్ని హిందూపురం జ్ఞాపకాల ప్రస్తావన ఇది.
హిందూపురానికి లేపాక్షితోనే శతాబ్దాలుగా గుర్తింపు. ఆ లేపాక్షి చరిత్ర తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత. చెబితే అదంతా చర్వితచర్వణం అవుతుంది. గతంలో ఐ ధాత్రి ధారావాహికంగా ప్రచురించిన లేపాక్షి 12 కథనాల లింకులు ఆసక్తి ఉన్నవారికోసం.
- https://idhatri.com/pranams-to-the-great-persons-who-brought-into-light-the-greatness-of-lepakshi/
- https://idhatri.com/as-per-history-lepakshi-temple-built-before-vijayanagara-kingdom-itself/
- https://idhatri.com/the-history-behind-the-name-of-lepakshi-rama-jatayuvu-lepakshi-link/
- https://idhatri.com/virupanna-brothers-built-the-seven-ramparts-of-lepakshi-in-achyuta-deva-raya-regime/
- https://idhatri.com/hanging-pillar-is-the-best-example-for-the-lepakshi-sculptural-glory/
- https://idhatri.com/sitamma-padam-and-stone-plate-has-a-special-history-in-lepakshi-temple/
- https://idhatri.com/lepakshi-shiva-parvati-kalyana-mandapam-virupanna-eyes-different-versions/
- https://idhatri.com/nandi-known-as-basavaiah-is-another-sculptural-wonder-at-lepakshi-temple/
- https://idhatri.com/the-paintings-on-the-ceilings-of-lepakshi-temple-reflected-our-art-and-culture/
- https://idhatri.com/our-epics-and-history-depicted-through-sculptures-and-paintings-at-lepakshi-temple/
- https://idhatri.com/the-literature-and-poetry-that-glorified-the-lepakshi-temple/
- https://idhatri.com/governments-to-do-more-initiatives-for-the-intensify-the-glory-of-lepakshi-temple/
1972 లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన మూడు ఆశ్రమ పాఠశాలల్లో హిందూపురం పక్కన కొడిగెనహళ్ళిలో ప్రారంభమైన పాఠశాలలో చదువుల దాహం తీరనిది. కొన్ని దశాబ్దాలపాటు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఫలితాల్లో మొదటి పది ర్యాంకులు కొడిగెనహళ్ళి విద్యార్థులకే వచ్చేవి. కొడిగెనహళ్ళిలో సీటుకోసం ప్రవేశపరీక్షకు దీక్షగా చదివిన కాలం; ఇక్కడ సీటు వస్తే ఇక చదువులకు దిగుల్లేదనుకున్న కాలం ఒకటి ఉండేది. ఈ ఆశ్రమ పాఠశాల ఎదురుగా కల్లూరు సుబ్బారావు సౌజన్యంతో సమరయోధుడు ఏ ఎం లింగణ్ణ స్థాపించిన సేవామందిర్ చరిత్ర కూడా చిన్నది కాదు.
హిందూపురంలో 1950లో ప్రారంభమైన మహాత్మా గాంధీ మునిసిపల్- ఎం జి ఎం హై స్కూల్ ది ఒక చరిత్ర. ఆ స్కూల్ కు హెడ్ మాస్టర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన సుబ్బారావు సార్ ది ఒక చరిత్ర. దాదాపు రెండు వేలమంది విద్యార్థులను ఆయన కంటిచూపుతో నియంత్రించేవారు. ఒక సైన్స్ ఎగ్జిబిషన్ వార్త రాయడానికి విలేఖరిగా నేను ఎం జి ఎం కు వెళ్ళాను. ఆ కార్యక్రమంలో ప్రధాన వక్త నాకు ఇంటర్లో ఫిజిక్స్ పాఠాలు చెప్పిన వెంకటరమణయ్య సార్. నేను వెళ్ళేసరికి ఒక పెద్దాయన చేతులు కట్టుకుని వినయంగా సుబ్బారావు సార్ తో ఇలా అంటున్నాడు. “సార్! మీ చల్లని చేత్తో మా నాయనా దెబ్బలు తిన్నాడు; నేనూ దెబ్బలు తిన్నాను. ఇద్దరమూ ఇక్కడే చదువుకున్నాము. బెంగళూరులో ఉద్యోగంలో ఉన్నాను. మీరు కొట్టి చెప్పిన ఇంగ్లీషే ఇప్పుడు నాకు కూడు పెడుతోంది” అని కాళ్ళమీద పడి నమస్కారం పెట్టి సార్ టేబుల్ మీద అరటి పళ్ళు పెట్టి అలాగే నిలుచున్నాడు. “ఊరుకోప్పా! అసలే ఈయప్ప విలేఖరి. రాసినా రాస్తాడు. సుబ్బారావు చండశాసనుడు…అని నోటికిచ్చింది ఏదైనా రాయచ్చు…” అంటూ నావైపు తిరిగి నవ్వుతున్నారు. “రాస్తే రాయనియ్యండి సార్! టీచర్లు కాకపొతే ఊళ్ళోవాళ్ళు కొడతారా!” అని అన్నాడు ఆ పెద్దమనిషి. “సార్! మీరు మిలటరీలో ఏమన్నా పనిచేశారా? మిలటరీవారిలా మీసాలు పెంచుతారు. వేషం, భాష కూడా అలాగే ఉంటుంది…” అని అడిగాను నేను. “నువ్వొచ్చిండేది సైన్స్ ఎగ్జిబిషన్ వార్త రాయడానికా? నా మీసాల మీద కవిత్వం రాయడానికా?” అని వెంటనే వాత పెట్టారు. సుబ్బారావు సార్ కు ముందు తరువాత ఎందరో ఎం జి ఎం కు హెడ్మాస్టర్లు ఉండవచ్చు. కానీ హెడ్మాస్టర్ అంటే సుబ్బారావు సారే. ఆయన వీధుల్లో నడిచి వెళుతుంటే సైకిల్ దిగి నమస్కారం పెట్టి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళేవారందరూ ఆయన విద్యార్థులే. ఊళ్ళో ఏ ప్రోగ్రాం జరిగినా ఆయన వస్తే సింహం వచ్చినట్లే. ఎవరికి వారు వెళ్ళి సార్ నేను ఫలానా బ్యాచ్ అని ప్రవర చెప్పుకుని నమస్కారం పెట్టి రావాల్సిందే. పిల్లలను తీర్చిదిద్దడానికే పుట్టారు మీరు అని రిటైరయ్యాక ఒకసారి నేను సార్ తో అంటే “దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చినాడప్పా! నాతోపాటు పనిచేసిన టీచర్లు నాకంటే గొప్పోళ్ళు. ఈ ఊరు నన్ను నెత్తిన పెట్టుకుంది. పిల్లోళ్ల చదువులు, వాళ్ళ తెలివి తేటలు గొప్పవి. నేను నిమిత్తమాత్రుడిని” అని పులకింతగా ఎంజిఎం ఎదుగుదల గురించి చెప్పుకుపోయారు.
ఎం జి ఎం ఎదురుగా ఉన్న గ్రవుండ్ ఎన్ టీ ఆర్ మెదలు ఎందరెందరు మహామహుల బహిరంగసభలకు వేదిక అయ్యిందో!
1965 లో ప్రారంభమైన శ్రీ శారదాంబా దాసా గోవిందయ్య శెట్టి- ఎస్.డి.జి.ఎస్. ప్రయివేటు కాలేజీ గురించి ఎంతయినా చెప్పచ్చు. అనంతపురం జిల్లా కేంద్రం తరువాత హిందూపురం చదువులకు ఒక కేంద్రం కావడానికి ఎస్ డి జి ఎస్ కాలేజే కారణం. నేను ఆ కాలేజీలోనే ఇంటర్, డిగ్రీ చదివాను. పేరుకు తగ్గట్టు తెల్లటి భవనం. అప్పట్లో ఎస్ డి జి ఎస్ లో సీటు రావడం అంటే స్టాన్ఫోర్డ్ లో సీటు వచ్చినట్లే. ఒక్కో సబ్జెక్ట్ లో పేరుమోసిన లెక్చరర్లు. వారు తీర్చిదిద్దిన విద్యార్థులు. అక్కడ చదివి అక్కడే లెక్చరర్లు అయినవారు ఎందరో! ఎస్ డి జి ఎస్ కాలేజీ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం సార్ మెత్తటి మనిషి. ఎవ్వరినీ నొప్పించడు. కానీ చాలా స్ట్రిక్ట్. ఆయన ఆధ్వర్యంలో ఎస్ డి జి ఎస్ వెలిగిన వెలుగే వెలుగు.
ఇంకా ప్రస్తావించాల్సినవారు చాలామంది ఉన్నారు. అన్నీ ఒక్కరోజే చెప్పడం కుదరదు.
రేపు:-
హిందూపురం కథలు- 4
“కనుమరుగైన కళాశాల”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు