తమ పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ వాహన శ్రేణిపై దాడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమరావతి రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి తిరిగి వస్తుండగా దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
పోలీసుల సమక్షంలో దాడి చేయడం దారుణమని, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఈ ఘటన జరిగిన తరువాత ఇంత వరకూ దీనిపై ప్రభుత్వ పరంగా స్పందన లేకపోవడం సరికాదన్నారు.
బిజెపి కార్యకర్తలే మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంపై దాడి చేశారంటూ వైసీపీ ఎంపి చెప్పడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేయడం రెచ్చగొట్టాడమేనని వీర్రాజు స్పష్టం చేశారు. దాడిపై ఇపటికే కేంద్ర నాయకత్వానికి నివేదిక పంపామన్నారు.