Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Special Recognition For The Sammakka Saralamma Jatara :

తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు 332 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 16,17,18,19 తేదీల్లో మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నేడు మేడారంలో రాష్ట్ర స్థాయి సమీక్ష చేశారు. 18వ తేదీన సీఎం కేసిఆర్ జాతరకు వచ్చే అవకాశం ఉందని, మేడారం జాతరకు వచ్చే భక్తులు, పూజారుల మనోభావాలు దెబ్బ తినకుండా జాతర నిర్వహిస్తామని తెలిపారు.

జాతర కోసం చేపట్టిన పనులలో ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయని మంత్రులు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, ఓమిక్రాన్, కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖకు కోటి రూపాయలు కేటాయించామని చెప్పారు. గత జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందు నుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు.

రోడ్ల పనులు, ఇరిగేషన్,గ్రామీణ నీటి సరఫరా శాఖ పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6400 టాయ్లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. జాతర పటిష్ట నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లు గా, 34 సెక్టర్లుగా విభజించినట్లు తెలిపారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతర సమయంలో పారిశుధ్య నిర్వహణ కోసం 450 మంది సబ్ సెక్టోరియల్ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 4000 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జెసిబి లు, 20 టాటా ఏస్ వాహనాలు, సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించడానికి 70 ట్రాక్టర్లు పెట్టాం అన్నారు. భక్తుల సౌకర్యార్థం 200 డస్ట్ బిన్స్ పెట్టామన్నారు.

జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 50 బెడ్లతో సమ్మక్క – సారలమ్మ వైద్యశాల ఏర్పాటు చేసి, అక్కడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకల వైద్య శాల, మరో 19 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటితో పాటు ములుగు, ఏటూరు నాగారం, పరకాల వద్ద తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖనాలు, తాడ్వాయి దగ్గర 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పస్రా దగ్గర 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవున 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశాం అన్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సు లు, 15 బైక్ అంబులెన్సు లు ఏర్పాటు చేసాం అన్నారు.

కరోనా తీవ్రత నేపథ్యంలో ఒక ఐసోలేషన్ షెడ్ ఏర్పాటు చేశామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కొసం 3,845 బస్సులు వేయడం జరిగిందన్నారు. 51 గమ్య స్థానాల నుంచి నడుస్తాయన్నారు. 50 ఎకరాల్లో బస్ స్టేషన్ నిర్మించామని, 41 క్యు లైన్లు ఏర్పాటు చేశాం అన్నారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సీసీ కెమెరాల సర్వియలెన్సే కేంద్రం ఏర్పాటు చేశాం అన్నారు. 1500 మంది ప్రయాణికులు విశ్రాంతి, పడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం అన్నారు. ప్రయాణికులందరికి సానిటైజ్ చేస్తామని, మాస్క్ లు అందిస్తాం అన్నారు.

నార్లాపూర్ నుంచి జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించాం అన్నారు. జాతరలో నిత్యం వెలుగుల కోసం 4200 ఎల్.ఈ. డి బల్బులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసాం అన్నారు.  ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించామని, 10,300 మంది పోలీస్ సిబ్బంది, ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పశ్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, టోయింగ్ వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది.

మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు. మీడియా సెంటర్ లో వైఫై అవకాశం ఉంటుంది. 13 సాంస్కృతిక బృందాలతో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత తెలిపే ఏర్పాట్లు. జాతర సందర్భంగా మంచి ఫోటో లు తీసీన వారిని గుర్తించి లక్ష రూపాయల బహుమతి ఇస్తారు.

సమావేశానికి ముందు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు, నేతలు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు.

సమీక్ష సమావేశంలో ఎంపిలు పసునూరి దయాకర్, మాలోతూ కవిత, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే లు గండ్ర వెంకటరమణారెడ్డి, దనసరి అనసూయ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చొంగ్తు, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శరత్, అటవీ శాఖ పిసిసీఎఫ్ శ్రీమతి శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, శాంతి, భద్రతల అదనపు డీజీలు జితేందర్, నాగిరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఎస్పి సంగ్రామ్ సింగ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూరు నాగారం అదనపు పి. ఓ వసంత్ రావు, మేడారం ఈ. ఓ రాజేందర్, మేడారం ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Also read : ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com