Sunday, January 19, 2025
HomeTrending Newsఎస్టీపీల్లో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు

ఎస్టీపీల్లో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలోని ఫతేనగర్, కోకాపేటలో జరుగుతున్న ఎస్టీపీల నిర్మాణ పనులను శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న అన్ని ఎస్టీపీలపైన జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్టీపీల నిర్మాణాల వల్ల చుట్టు పక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యంగా నివాసాలకు సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. వీటి వల్ల దుర్వాసన రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్టీపీల ప్రాంగణాల్లో హెచ్ఎండీఏ సహకారంతో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు గానూ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎస్టీపీల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, తద్వారా నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగును పూర్తి శాతం శుద్ధి చేసే వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు.

మూడు ప్యాకేజీల్లో 31 ఎస్టీపీల నిర్మాణం:
నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా సుమారు రూ.3,800 కోట్ల వ్యయంతో జలమండలి చేపట్టిన 31 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎమ్మెల్డీల (మిలియన్ లీటర్ పర్ డే) మురుగు నీరు శుద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) జలమండలి నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ప్యాకేజీ-I లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో.. రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. వీటి మొత్తం సామర్థ్యం 402.50 ఎంఎల్డీలు. ప్యాకేజీ-II లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ. 1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజీ-III లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 376.5 ఎంఎల్డీలు.

ఫతేనగర్ ఎస్టీపీ వివరాలు:
ప్యాకేజీ-III లో భాగంగానే ఫతేనగర్ లో నిర్మించనున్న ఎస్టీపీకి గతంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంఖుస్థాపన చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ ద్వారా నిత్యం 133.0 ఎంఎల్డీల మురుగు నీరు శుద్ధి అవుతుంది. బాలానగర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, సూరారం, జగద్గిరిగుట్ట నుండి వచ్చే మురుగును ఈ ఫతేనగర్ ఎస్టీపీలో శుద్ధి చేస్తారు. 2036వ సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా, 9.84 లక్షల జనాభాకు సరిపడా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
కోకాపేట ఎస్టీపీ వివరాలు:
ప్యాకేజీ -II లో భాగంగా మూసీకి దక్షిణ వైపున మురుగునీటి శుద్ధి కోసం రాజేంద్రనగర్ పరిధిలోని కోకాపేటలో రూ.33.67 కోట్ల వ్యయంతో 15 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సీవరేజ్ ట్రీట్మెట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీని ఈ ఎస్టీపీలో వినియోగించనున్నారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ఎస్టీపీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

సేఫ్టీ ప్రోటోకాల్ వాహనాలు ప్రారంభం:
అనంతరం కోకాపేటలోని ఎన్సీసీ క్యాంపస్లో జలమండలి సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీవీఓ రవిచందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సేఫ్టీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలు:
”పని ప్రదేశంలో భద్రత.. ప్రజల భద్రత(వర్క్ సైట్ సేఫ్టీ ఈజ్ పబ్లిక్ సేఫ్టీ)” అనే నినాదంతో నగరంలో జలమండలి చేపట్టే వివిధ పనులు జరిగే ప్రదేశాల్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. జలమండలి చేపట్టే పైప్ లైన్ విస్తరణ, సీవరేజ్ పనులు, లీకేజీల నివారణ పనులు, మ్యాన్ హోల్ మరమ్మత్తులు, ఇలా ప్రతి పని ప్రదేశంలో భద్రతా చర్యలు కచ్చితంగా పాటించేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్స్(ఎస్పీటీ) పేరుతో ఆరు జలమండలి సర్కిళ్లకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక ఇంజనీర్, ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు కమ్ డ్రైవర్ ఉంటారు. ఈ మొత్తం బృందాలకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఇంఛార్జిగా వ్యవహరిస్తారు.

సేఫ్టీ ప్రోటోకాల్ వ్యవస్థ ప్రత్యేకతలు:
ఇక నుంచి నగరంలో జలమండలి చేపట్టే ప్రతి పనిని ఈ బృందాలు పరిశీలిస్తాయి. అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం భద్రతా చర్యలు తీసుకుంటున్నారా, లేదా అనేది తనిఖీ చేస్తాయి. ఈ బృందాల కోసం సీఎస్ఆర్ నిధులతో ఆరు ఎస్పీటీ వాహనాలను(సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్) ఏర్పాటుచేశారు. ఈ వాహనాలను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ వాహనాల్లో పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా పని జరుగుతున్న ప్రదేశంలో రక్షణ పరికరాలు లేకపోయినా, బారీకెడ్లు ఏర్పాటు చేయకపోయినా ఈ బృందాలే ఏర్పాటు చేస్తాయి. రాత్రివేళల్లో పనులు జరిగే ప్రాంతాల్లో సరైన లైటింగ్, రేడియం సూచికల ఏర్పాటు తదితర భద్రతా చర్యలు పాటిస్తున్నారా, లేదా అనేది కూడా ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. పనులు జరుగుతున్న ప్రదేశాల జీఐఎస్ వివరాలు సైతం ఎస్పీటీలకు అందుతాయి. వీటి ఆధారంగానే ఈ బృందాలు పని ప్రదేశాలకు వెళ్లి తనిఖీలు చేస్తాయి. ఎస్పీటీ వాహనాలకు కెమెరా, బృందంలోని ఒక సభ్యుడికి బాడీ కెమెరా ఉంటాయి. వీటితో పాటు జీపీఎస్ ట్రాకింగ్ చేస్తూ నిరంతరం వీటిని సైతం పర్యవేక్షిస్తారు. పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవద్దనే ఆలోచనతోనే ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్