రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్ని వర్గాలనూ మోసం చేస్తోందని ఆరోపించారు. మైనారిటీల్లో వ్యాపారం చేసుకునే వారికి మూడు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేసి దానిలో లక్ష రూపాయల వరకూ సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. దీనిద్వారా పదివేల మంది ముస్లింలకు సాయం చేశామన్నారు. స్వయం ఉపాధికి కంకణం కట్టుకుని పనిచేశామన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులతో అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ఏపీలో మార్పు మొదలైందని, ఈ సభకు ఇంతమంది మైనార్టీలు హాజరు కావడం దారా ఇది స్పష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్టులో మైనార్టీ రిజర్వేషన్స్ అంశం విచారణకు వచ్చినప్పుడు వారి తరఫున గట్టిగా వాదనలు వినిపించామని బాబు గుర్తు చేశారు. ఇమామ్ లకు ఎనిమిది వేలు, మౌజామ్ లు ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. ఉర్దూను రెండో భాషగా చేయాలన్న వాదనకు కూడా తాము మద్దతుగా నిలిచామన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ షరీఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.