‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటగా ఆక్వారంగంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో 23న, గురువారం ఈ సదస్సు జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగాహాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం పతనావస్థకు చేరిందని, సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం రైతులను వంచించిందని, హామీ అమలు చేయకుండా విద్యుత్ కోతలతో ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అనేక షరతులతో… ఉన్న సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.