Saturday, April 20, 2024
HomeTrending Newsగ్రామ మహిళా పోలీస్‌ గుర్తింపు హర్షణీయం

గ్రామ మహిళా పోలీస్‌ గుర్తింపు హర్షణీయం

Village Women Police : గ్రామ మహిళా పోలీస్‌ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేసి ప్రత్యేక వ్యవస్థగా గుర్తించడం శుభ పరిణామమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమె సోమవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్‌, జాబ్‌ చార్ట్, సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల ఖరారుతో పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని పేర్కొన్నారు. మహిళా పోలీసు, సీనియర్‌ మహిళా పోలీసు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ), ఇన్‌స్పెక్టర్‌ (నాన్‌ గెజిటెడ్‌).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణించనున్నట్లు వివరించారు. మహిళా పోలీస్‌ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే వారి సేవలను మరింత సమర్థంగా గ్రామ,  వార్డు సచివాలయాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. పోలీసు శాఖ పదోన్నతులతో సంబంధం లేకుండా మహిళా పోలీసులకు ప్రత్యేకంగా పదోన్నతులు లభిస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా నియమించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలందిస్తూనే, మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణే ధ్యేయంగా మహిళా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ కృషిని వాసిరెడ్డి పద్మ ప్రశంసించారు.


తాజాగా నిర్ణయంతో ఇంతవరకు ఈ వ్యవస్థపై నెలకొన్న అపోహలకు ప్రభుత్వం తెరదించిందని తెలిపారు. కానిస్టేబుల్‌ నుంచి సీఐ వరకు పోలీస్‌ శాఖలో ఉన్న రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాధికారాలు వీరికీ వర్తిస్తాయన్నారు. శాంతిభద్రతలు, మహిళలు, పిల్లల రక్షణ, ప్రజా సేవలు సహా పలు అంశాలపై ఇన్‌డోర్, 10 విభాగాల్లో అవుట్‌ డోర్‌ శిక్షణ ఇవ్వడం కూడా మంచిదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు రిపోర్ట్‌ చేయడం, తమ పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు రోడ్‌ సేఫ్టీ, సైబర్‌ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ,మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టడంలో మహిళా పోలీసుల పాత్ర కీలకమన్నారు. ఆత్మహత్యలు, ఒత్తిడి అధిగమించడంపై రైతులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, అవసరం మేరకు పోలీస్‌ స్టేషన్‌లలో కేసుల విచారణకు సహాయపడటంలో వీరు చురుగ్గా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడం, బాల్య వివాహాల కట్టడికి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర శాఖలతో కలిసి పనిచేస్తున్నారని వివరించారు. గృహ హింస, బాల్య వివాహం, లైంగిక వేధింపుల చట్టాలపై ప్రజలకు అవగాహన చేయడంతో క్షేత్రస్థాయిలో మహిళల జీవితాల్లోనూ మార్పులు గమనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లా చేబ్రోలు, వినుకొండ ఏరియాల మహిళా పోలీసులు పలు కీలకమైన కేసుల్ని చేధించడంలో చురుకుగా పనిచేసి ప్రశంసలు పొందినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు.

Also Read : తెలుగు సినిమా సమున్నత శిఖరం ఎల్వీ ప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్