Sunday, May 19, 2024
HomeTrending Newsమూడు సాధ్యం కాదు: సోమిరెడ్డి

మూడు సాధ్యం కాదు: సోమిరెడ్డి

రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు శాంతియుతంగా తమ ఆశయ సాధన కోసం పాదయాత్ర చేస్తుంటే మంత్రులు దాన్ని హేళన చేసేలా మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సీనియర్ మంత్రి అయిన ధర్మాన కూడా ఇలా మాట్లాడడం భావ్యం కాదన్నారు. నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా అమరావతిని జగన్ స్వాగతించారని, ఇప్పుడు మూడు రాజధానులు అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి అసలు రాజధాని ఏది అంటే ఏమి చెబుతారని, పెట్టుబడులు ఎలా వస్తాయని సోమిరెడ్డి ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో మూడు రాజధానులు విఫలమయ్యాయని, మళ్ళీ ఒకే రాజధానిగా చేసేందుకు వారు సిద్ధమవుతున్నారని వెల్లడించారు.  మహారాష్ట్రలో కూడా శాసన సభ సమావేశాలు ముంబై, నాగపూర్ లో జరుపుతారని, కానీ నాగపూర్ లో  అసెంబ్లీ నిర్వహణ భారంతో కూడుకున్నదని, అందుకే దాన్ని ఉపసంహరించే దిశగా వారు ఆలోచిస్తున్నారని సోమిరెడ్డి వివరించారు.  ఇలాంటి పరిస్థితుల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో రాజధానులు పెట్టడం అనేది అధిక వ్యయంతో కూడుకున్నదన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

అమరావతిలో ఎస్ఆర్ ఎం, ఎయిమ్స్, విట్ లాంటి సంస్థలు వచ్చాయని, విద్య, వైద్య రంగాల్లో దాదాపు 120 సంస్థలు అక్కడకు వచ్చేందుకు ఒప్పందాల కోసం ముందుకొచ్చారని, కానీ ఈ ప్రభుత నిర్ణయంతో వారు వెనకడుగు వేశారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి తాము వ్యతిరేకం కాదని,  కానీ ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయవద్దని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

గతంలో తాము దుల్హన్ పథకం ప్రవేశ పెడితే దాన్ని మూడున్నరేళ్ళు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కళ్యాణమస్తు పేరుతో మొదలుపెడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇంతకాలంపాటు ఈ పథకానని పొందలేకపోయినవారి సంగతి ఏమిటని ప్రశ్నించారు.  చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన  గొప్ప పథకాలన్నీ ఆపేసి ఈ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

Also Read : సమ న్యాయం అని రాజ్యాంగమే చెప్పింది: ధర్మాన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్