Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనా ఫేస్...నా ఇష్టం

నా ఫేస్…నా ఇష్టం

Trump to launch his own social media platform, calling it TRUTH Social

ప్రపంచం పట్టనంతగా డిజిటల్ మీడియా పెరిగిపోతోంది. ఇది బలుపో, వాపో డిజిటల్ మీడియాకే అర్థం కాని అయోమయావస్థ. ఆర్గానిక్ సహజ వృద్ధి, ఇనార్గానిక్ అసహజ వృద్ధి రెండు పద్ధతుల్లో డిజిటల్ మీడియాది తొంభై శాతం అసహజ వృద్ధే అయి ఉంటుంది.

మంచి- చెడు; సంయమనం; సంప్రదాయాలు; ఆచారాలు; విలువలు; మర్యాదాల్లాంటి సకల హద్దులను డిజిటల్ మీడియా చెరిపేసింది. మీడియా చట్టాల చట్రంలో డిజిటల్ మీడియాను బిగించాలని ఎన్ని చట్టాలు చేస్తున్నా అవి ప్రస్తుతానికి నీటి మీద రాతలే.

వెబ్ సైట్లు, యూ ట్యూబులను మొదట మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. స్మార్ట్ ఫోన్లలోకి డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వచ్చాక, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, సిగ్నల్, టైలిగ్రామ్ లు వచ్చాక మెయిన్ స్ట్రీమ్ మీడియా పునాదులు కదులుతున్నాయి.

అంతర్జాతీయంగా శతాబ్దాల చరిత్ర ఉన్న దిన పత్రికలు, మ్యాగజైన్లు మూతపడుతున్నాయి. లేదా ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.

మీడియా నిష్పాక్షికంగా ఉండాలన్నది ఒక ఆదర్శం. ఆచరణలో లెఫ్ట్ కో, రైట్ కో, ముందుకో, వెనుకకో, కిందికో, పైకో బెండ్ అయి ఉంటుంది. రాజకీయ, ఆర్థిక, ప్రాంతీయ, కులం లెక్కలు ఎన్నో మీడియాను ప్రభావితం చేస్తూ ఉంటాయి. తెలుగు మీడియాలో ఎవరు ఏ రంగు పులుముకున్నారో బహిరంగ రహస్యం. పాఠకులు కూడా తమ కళ్లతోనే లోకాన్ని చూడాలనుకుని మీడియా రాస్తూ, చెబుతూ ఉంటుంది. కానీ…పాఠకులకు మీడియా అసలు రంగు తెలుసు కాబట్టి…ఏ వార్తలో ఏ రంగును ఎంత మినహాయించుకోవాలో తెలిసి చదువుకుంటున్నారు. చూస్తున్నారు.

మీడియా రాజకీయాలను శాసించడం; రాజకీయాలు మీడియాను శాసించడం మనదగ్గరే కాదు… అంతర్జాతీయంగా కూడా ఉన్నదే. ముఖ్యమంత్రి, ప్రధానులను తామే తమ మీడియా హౌసుల్లో తయారు చేయగలం అని అనుకునే మీడియాలు ఇప్పటికీ ఉన్నాయి.
ఇందులో మంచి చెడుల చర్చ ఇక్కడ అనవసరం.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ది విచిత్రమయిన వైఖరి. నోటికెంత వస్తే అంత మాట్లాడే ట్రంప్ కు పోటీ ఇవ్వగల నాయకులు అంతర్జాతీయంగా ఎంతో మంది ఉండవచ్చుగాక. కానీ…ట్రంప్ కు ట్రంపే సాటి. రెండోసారి అధ్యక్షుడు కాకుండా ట్రంప్ ను అడ్డుకున్న అనేకానేక అంశాల్లో మీడియా ప్రధానమయిన కారణం. అమెజాన్ అధిపతి చేతుల్లోకి వెళ్లిన అమెరికా లీడింగ్ మీడియా వాషింగ్టన్ పోస్ట్ తో ట్రంప్ కు రోజూ గొడవే.

దీనికి తోడు డిజిటల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి ట్రంప్ కు వ్యతిరేకంగా పని చేశాయి. ఒక దశలో అధ్యక్షుడిగా ట్రంప్ అధికారిక డిజిటల్ అకౌంట్లను తొలగించాయి. రెండోసారి అధ్యక్షుడినై వీళ్లందరినీ ఒక ఆట ఆడుకుందామనుకున్న ట్రంప్ ఇప్పుడు సొంత గోల్ఫ్ గ్రౌండ్ లో గోళీలాడుకుంటున్నాడు. కింద పడ్డా పై చేయి నాదే అనడంలో ట్రంప్ తరువాతే ఎవరయినా. లక్షల కోట్ల సంపద మూలుగుతోంది.

తనను బహిష్కరించిన డిజిటల్ మీడియాకు క్షమాపణలు చెప్పి మళ్లీ అన్ని ఖాతాలను ఆన్ చేసుకోవచ్చు. అలా చేస్తే అతడు ట్రంప్ ఎందుకవుతాడు? ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్- TMTG- పేరిట సొంత పెట్టుబడితో కొత్త మీడియా కంపెనీని మొదలు పెట్టాడు. TMTG ఆధ్వర్యంలో Truth Social- ట్రూత్ సోషల్ పేరిట సొంత ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ లాంటి అనేకానేక సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ను కొత్తగా ఆవిష్కరించారు.వీటి బీటా వర్షన్ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. రేపో మాపో అధికారికంగా ట్రంప్ అభిమానులకు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి.

కొండకు డిజిటల్ వెంట్రుక వేస్తున్నాడు ట్రంప్.
వస్తే-
రెండోసారి అమెరికా అధ్యక్ష కొండ.
పోతే-
డిజిటల్ వెంట్రుక!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

సంసారాల్లో డిజిటల్ చిచ్చు

Also Read:

అమరత్వం కోసం కుబేరుల ఆరాటం

Also Read:

ఓ టి టి సునామి

RELATED ARTICLES

Most Popular

న్యూస్