BJP for Name Change: జగనన్న కాలనీలకు తానే స్వయంగా వెళ్లి మోడీ కాలనీలుగా పేర్లు మారుస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఛాలెంజ్ చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తోందని, కేంద్ర పథకాలకు జగన్ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి, అవకతవకలు జరిగాయని… ఒక్కో ఎకరం 30 లక్షలకు కొని దాన్నే కోటి రూపాయలకు అమ్ముకున్నారని వీర్రాజు ఆరోపించారు. బాపట్లలో జరిగిన బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో వీర్రాజు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పది వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సోము వెల్లడించారు. కానీ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయల పంచాయతీ రహదారులను జగన్ ప్రభుత్వం ఎందుకు వేయించలేకపోతోందని, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ మంత్రులు ఏం చేస్తున్నారని అయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకు రాకపోతుంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని వీర్రాజు నిలదీశారు.
గ్రామాల్లో నిర్మిస్తున్న విలేజ్ సెక్రటేరియట్, జగనన్న హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న ఉపాధి హామీ పథకం నిధులతోనే చేపడుతున్నారని, కానీ వీటికి మోడీ పేరు ఎందుకు పెట్టడంలేదని, వెంటనే పేరు మార్చాలని వీర్రాజు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీపాద రామ సాగర్ (పోలవరం) ప్రాజెక్టుల పేర్లు మార్చారని, కానీ గుంటూరు జిన్నా సెంటర్, కింగ్ జార్జ్ హాస్పిటల్ పేర్లు మార్చడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు.