ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకుని ఆదివాసీలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అడవినే నమ్ముకుని జీవించే నిష్కల్మశ హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు. దేశానికే ఆదర్శంగా ఆదీవాసీ అభివృద్ధి కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. ఈ దిశగా స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్ల కాలంగా అమలు చేస్తున్న పలు పథకాలు విజయవంతంగా అమలవుతూ వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయని సిఎం వివరించారు.
జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడిన నాటి ఆదీవాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కుమ్రం భీం ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి చూపిందన్నారు. అడవిలో మారుమూలన వున్న గోండు గూడాలకు గిరిజన తాండాలకు కూడా మిషన్ భగీరథతో తాగునీరును, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో, ఉచిత విద్యుత్ వ్యవసాయానికి సాగునీరును అందిస్తూ ‘జల్’ నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందని సిఎం అన్నారు.
అడవులను పునరుజ్జీవింప చేసే కార్యక్రమాలను చేపడుతూ, అటవీ భూములను రక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతూ.. దేశానికే ఆదర్శంగా ‘జంగల్’ ను కాపాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అదే సందర్భంలో ఆదివాసీ గిరిజనుల జమీన్’ హక్కును కాపాడుతూ అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతులకు పోడు పట్టాలందించామని సిఎం తెలిపారు. 4 లక్షలకు పైగా ఎకరాల పోడు భూమిని 1 లక్షా యాభై వేలమంది ఆదివాసీలకు పట్టాలు అందించిన దేశంలోనే అతిపెద్ద మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. వారికీ అందరితోపాటు రైతుబంధు రైతుబీమా పథకాలను వర్తింపచేస్తూ ఆదివాసీ గిరిజన రైతు కుటుంబాల వ్యవసాయానికి అండగా నిలిచామన్నారు. ‘మావ నాటే మావ రాజ్’ అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2471 గూడేలను తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే కాకుండా అంతే సంఖ్యలో గిరిజన, ఆదివాసీ బిడ్డలను ప్రజాస్వామిక అధికార వ్యవస్థలో భాగస్వాములను చేసామని సిఎం తెలిపారు.
అదే సందర్భంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. హైద్రాబాద్ నట్టనడుమ బంజారా హిల్స్ లో కోట్లాది రూపాయల విలువైన కుమ్రం భీం, సంత్ సేవాలాల్ పేర్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇచ్చామని సి ఎం అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వారికి ఉన్నత ప్రమణాలతో కూడిన గురుకుల విద్యను, విదేశీ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నారు. గిరిజన సంస్కృతి,సంప్రదాయాలను గౌరవించుకుంటూ వారి పండుగలైన సంత్ సేవాలాల్ జయంతి, కుమరంభీం జయంతి, వర్ధంతులు, భౌరాపూర్ జాతర, కేస్లాపూర్, నాగోబా, జంగుబాయి జాతర, నాచారం జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదని, ఇదే స్పూర్తిని కొనసాగిస్తామని సిఎం స్పష్టం చేశారు.