Friday, May 31, 2024
HomeTrending Newsఏపీలో మాఫియా పనిపడతాం : మోడీ

ఏపీలో మాఫియా పనిపడతాం : మోడీ

గతంలో దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఆరోపించారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలు అంటూ విభజన సృష్టించడానికి విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి నుంచి ఈ మాటలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంకోసం  దేశాన్ని విభజించాలని కుటిల యత్నాలు చేస్తున్నారని, భారత్ విభిన్న జాతుల సమూహం అని, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అనే విభజన రేఖ గీస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యువనేత విదేశాల్లో కూడా అదే మాటలు అన్నారని గుర్తు చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో ఎన్డీయే కూటమి ఏర్పాటు చేసిన బహిరంగసభలో విపక్షాలపై మోడీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

రాయలసీమను అభివృద్ధిని పథంలో తీసుకువెళ్ళడం, ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని మోడీ  స్పష్టం చేశారు.  రాయలసీమలో వనరులకు కొరత లేదని, దేవాలయాలు, గనులు, ఖనిజాలు, కష్టపడి పనిచేసే యువత కూడా ఉన్నారని అలాంటి ఈ సీమను అభివృద్ధి ఛేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం ఎంతో మంది ముఖ్యమంత్రులను ఇచ్చిందని, కానీ ఐదేళ్లుగా ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఉపాధి కోసం వలస వెళ్ళాల్సిన దుస్థితి నెలకొని ఉందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని, అందుకే ‘ఆంధ్ర ప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి’…. ‘ ఆంధ్ర ప్రదేశ్ వికాసం – మోడీ లక్ష్యం’  అంటూ తెలుగులో చెప్పారు.

గత ఎన్నికల్లో ఎన్నో ఆశలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించారని, కానీ వారు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, రౌడీ రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. మాఫియాను పెంచి పోషిస్తున్నారని, మంత్రులు గూండాయిజానికి పాల్పడుతున్నారని, ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే మాఫియా పని పడతామని, పక్కా ట్రీట్ మెంట్ ఇస్తామని హెచ్చరించారు.

ప్రతి ఇంటికీ నీరు ఇచ్చేందుకు జల జీవన్ మిషన్ పెడితే దాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని, పోలవరం, సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని…. తాము రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. దక్షిణాదికి కూడా బులెట్ ట్రైన్ రావాలని, ఏపీకి కూడా రావాలని ఆకాంక్షించారు.  భారత్ శక్తివంతంగా తయారయ్యిందని, అందుకే విదేశాల్లో మన మాటకు ఎంతో విలువ ఇస్తున్నారని… దీనికి తోడుగా పటిష్టమైన రాష్ట్రాలుకూడా ఉండాలని అందుకే ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు.

రాబోయే ఐదేళ్ళలో టమాటా, ఇతర కూరగాయల నిల్వల కోసం ఓ చేస్తామని ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, పులివెందులలో అరటి ప్రోసెసింగ్ క్లస్టర్ నెలకొల్పుతామని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను విస్తరిస్తామని హామీల వర్షం కురిపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్