అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని కూడా పెంచుతామన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నివర్గాల హక్కులను కాలరాస్తోందని, అదే విధంగా పంచాయతీల అధికారాన్ని కూడా హరించి వేశారని ఆరోపించారు. మండపేటలో టిడిపి ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2002లోనే తమ ప్రభుత్వ హయంలో పంచాయతీలకు 64 అధికారాలు ఇచ్చామని తెలిపారు. తాను సిఎంగా ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమానికి వెళితే ఓ పక్క ఎమ్మెల్యే, మరోపక్క సర్పంచ్ లను కూర్చో బెట్టుకునేవాడినని.. అలా తాను వారికి గౌరవం ఇచ్చి ప్రోత్సహించానని, కానీ ఇప్పుడు సర్పంచ్ లు అనేవాళ్ళు కనుమరుగై పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు.
పంచాయతీల నిధులు ఏయే పనులకు ఖర్చు పెట్టాలనే దానిపై పూర్తి అధికారం సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామ సభకే ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుందని, నరేగా నిధులు కూడా పంచాలతీలకే వస్తాయని, ఒకరి అధికారాలను హరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. 92 వేల కోట్ల రూపాయలు పంచాయతీలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తమదేనన్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు సమకూర్చామన్నారు. తమ హయంలో 100 అవార్డులు పంచాయతీరాజ్ శాఖకు వచ్చాయని వివరించారు. 25 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 27 లక్షల ఎల్ ఈ డీ బల్బులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, 2115 పంచాయతీలకు భవనాలు, 5800 అంగన్ వాడీలు, గ్రామీణ నీటి సరఫరా కోసం 8,214 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, దీపం కింద వంట గ్యాస్ అందించామని చంద్రబాబ్ వివరించారు. 22 లక్షల కుటుంబాలకు మరుగు దొడ్లు, 45వేల చెరువులు ఆధునీకరించి, వాటిని పార్క్ లుగా తీర్చి దిద్దామన్నారు. 14, 15 ఆర్ధిక సంఘం ద్వారా పంచాయతీలకు వచ్చిన 8, 629 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం దారి మళ్ళించిందని, సర్పంచ్ ల సంతకం లేకుండానే దొంగతనంగా తరలించారని మండిపడ్డారు.
తమ హక్కుల కోసం పోరాడుతుంటే సర్పంచ్ లపైన కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని బాబు అన్నారు. సర్పంచ్ ల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.