దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహానుభావుల ప్రేరణతోనే జనసేన పార్టీ పని చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ఎప్పుడూ మనుషులను కలిపి ఉంచడానికే పని చేస్తుందని, విడగొట్టడానికి యత్నించదని, అది కులపరంగా కావచ్చు, మాట పరంగా కావొచ్చని హామీ ఇచ్చారు. భారత స్వతంత్ర అమృతోత్సవాల సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్భోదించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారు కడు పేదరికంతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వారు, జమీందార్లు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని సర్వస్వం పోగొట్టుకున్నారని, కానీ నేటి నాయకులు వారి సొంత ఆస్తులు పెంచుకుంటూ ప్రజల ఉమ్మడి ఆస్తులు కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించారు. నాటి తరం నేతలకు ఈ తరం నాయకులకు ఇదే తేడా అని వ్యాఖ్యానించారు.
నాటి మహనీయుల త్యాగ నిరతి, ఆ స్పూర్తిని సమాజంలో పెంపొందించాలనే లక్ష్యంతోనే, నిస్వార్ధంగా పనిచేసే యువత, సరికొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని జనసేన పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు. కొత్తతరం నేతలు సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.