ఫొటోగ్రఫీ అన్నది అత్యంత శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా 183 ఏళ్లు. ఒక లిప్తపాటులో మన ముందున్న దృశ్యం ఛాయాచిత్రంగా నమోదై, చరిత్రలో సమసిపోని జ్ఞాపకంగా మారుతున్నదీ అంటే అది ఫొటోగ్రఫీ మహత్యమే. మనిషి చూసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చివేసిన మాధ్యమం ఇది. నిజానికి తొలి ఫొటో తీసిన రోజు వేరే ఉంది. కానీ, ఈ అధునాతన ఫొటోగ్రఫిక్ ప్రాసెస్‌ను ఫ్రెంచి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించి, దానికి పెటెంట్ ఏర్పాటు చేసిన తర్వాతే, ఆ రోజునుంచి ఫొటోగ్రఫి అన్నది అధికారికంగా ప్రపంచానికి వెల్లడైంది.
ప్రపంచంలో ఇదే మొట్ట మొదటి ఫొటో…
తొట్ట తొలిగా ఫొటోగ్రఫీ విధానానికి మూలమైన ప్రాసెస్‌ను కనిపెట్టింది జోసెఫ్ నైస్‌ఫోర్ నిప్స్ , లూయిస్ డాగురే అన్న ఇద్దరు శాస్త్రవేత్తలు. వారిద్దరూ క్రీ.శ.1837లో రూపొందించిన విధానాన్నే డాగురే టైప్ ప్రాసెస్‌గా పిల్చుకుంటున్నం. అయితే, ఫ్రెంచి అకాడమీ ఆఫ్ సైన్సెస్ రెండేళ్ల తర్వాత అంటే 19 ఆగస్టు 1839న ఈ ప్రాసెస్‌ను అధికారికంగా స్వీకరించి ( పేటెంట్ చేసి) ఈ ఆవిష్కరణ ప్రపంచానికే ఒక కానుక అని ప్రకటించింది. ఆ రోజునే మనం ఫొటోగ్రఫీ డేగా జరుపుకుంటున్నం. కాగా, తొట్ట తొలి ఫొటోని జోసెఫ్ నైస్‌ఫోర్ నీస్ 1826లో కొన్ని గంటలపాటు కదలక మెదలక ఎంతో కష్టపడి తీశారు. ఆ చిత్రానికి కిటికీ నుంచి… అని పేరు. (View from the Window at Le Gras). ఆ తర్వాత ఫొటోగ్రఫీ ప్రపంచానికి గవాక్షం (Window)గా మారడం విశేషం.