విమెన్ ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు విజయం సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ముంబైకి తొలి ఓటమి ఎదురైంది. ఉత్కంత భరితంగా జరిగిన నేటి మ్యాచ్ లో యూపీ వారియర్స్ 5 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. చివరి ఓవర్లో ఐదు పరుగులు కావాల్సి ఉండగా, తొలి రెండూ డాట్ బాల్స్ అయ్యాయి, మూడో బంతిని సిక్సర్ గా మలిచి ఎక్సెల్ స్టోన్ జట్టుకు విజయం అందించింది.
నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో యూపీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టులో ఓపెనర్ హేలీ మాథ్యూస్-35; ఇస్సీ వాంగ్-32 ; హర్మన్ ప్రీత్ కౌర్-25 లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. యస్తికా భాటియా (7); నాటాలి స్కివర్ బ్రంట్(5); అమేలియా కెర్ర్ (3); అమన్ జోధ్ కౌర్(5) లు విఫలమయ్యారు. నిర్ణీత 20ఓవర్లలో 127 పరుగులకు ముంబై ఆలౌట్ అయ్యింది.
యూపీ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ 3; రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ చెరో 2; అంజలి శర్వాణి ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన యూపీ 27పరుగులకే మూడు వికెట్లు (దేవిక వైద్య-1, కెప్టెన్ అలిస్సా హేలీ-8; కిరణ్ నవ్ గిరే-12) కోల్పోయింది.ఈ దశలో తహిలా మెక్ గ్రాత్- గ్రేస్ హారిస్ లు క్రీజులో నిలదొక్కుకొని రాణించారు. తహిలా-38; హారిస్-39 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో దీప్తి శర్మ(13)-ఎక్సెల్ స్టోన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి గెలిపించారు.
దీప్తి శర్మ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.