Wednesday, May 29, 2024
HomeTrending Newsకెసిఆర్.. మెగా కృష్ణారెడ్డి తోడుదొంగలు: వైఎస్ షర్మిల

కెసిఆర్.. మెగా కృష్ణారెడ్డి తోడుదొంగలు: వైఎస్ షర్మిల

మెగా కృష్ణారెడ్డి కి రేవంత్ రెడ్డి,బండి సంజయ్ జీతగాళ్ళని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ మెగా కృష్ణా రెడ్డి తోడు దొంగలన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని ఈ రోజు విమర్శించారు. హైదరాబాద్ YSR తెలంగాణ పార్టీ  కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కెసిఆర్ పాలనపై విరుచుకు పడ్డారు. నా మెదడు, నా రక్తం, నా చెమట అన్నాడు. అందుకే మూడెళ్లలో మునిగి పోయిందని ఎద్దేవా చేశారు. అద్భుతమైన ప్రాజెక్ట్ అని అద్భుతమైన మోసం చేశారని, కాళేశ్వరంలో డెబ్బై వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు.

వైఎస్ షర్మిల విమర్శల్లో ముఖ్యాంశాలు…

రాజశేఖర్ రెడ్డి అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల అని 38 వేల కోట్ల ప్రాజెక్టుగా రూపొందించి, 16 లఓల 40 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని తలిస్తే కేసీఆర్ కమీషన్ల కోసం రీడిజైన్ పేరిట లక్షా 20 వేల కోట్ల పెంచారు. ప్రాజెక్టు కాస్టు మూడింతలు ఎందుకు పెంచారు? కేసీఆర్ ఇప్పుడు అడిషనల్ టీఎంసీ అంటున్నారు. ఇదెక్కడి లాజిక్? రెండు టీఎంసీలు పెంచి 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. పోయిన వానాకాలం 57 వేల ఎకరాలకు నీల్లు ఇచ్చామని మీరే చెప్పారు. ఇస్తామన్న నీటికి , ఇచ్చిన నీటికి పొంతన ఉందా? లక్షా ఇరవై వేల కోట్లలో దాదాపు లక్ష కోట్లు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చాయి. ఇది స్టేట్ లెవెల్ స్కాం కాదు.. దీనికి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చాయి కాబట్టి ఇది నేషనల్ స్కాం. ఇప్పుడు తీసుకున్న లోన్ కే 2023 సంవత్సరం నుంచి 13 వేల కోట్లు అప్పు కట్టాలి. ఇంకా ప్రాజెక్టు ఖర్చు పెంచుతూనే పోతున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం. ఈ ప్రాజెక్టు 2జీ , కోల్గేట్ లకు ఏమీ తీసిపోని స్కాం. మన రాష్ట్రానికే కాదు దేశానికి సంబంధించిన ప్రతి ట్యాక్స్ పేయర్ డబ్బు. ఇంత డబ్బు మన రాష్ట్రంలో దోచుకోవడటం తెలంగాణ ప్రజలకు అవమానం కాదా? ఇంత జరిగితే మేం తప్ప ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?
మన రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ బగీరథ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, రోడ్ల పనులు , ఎలక్ట్రికల్ బస్సులు అయినా ఏదైనా కేసీఆర్ మెగా క్రిష్ణారెడ్డికే ఇస్తున్నారు. కారణం వాళ్లిద్దరికి లావాదేవీలు ఉన్నాయి. మెగా క్రిష్ణారెడ్డి ఏ ప్రాజెక్టు ఇచ్చినా కూడా కేసీఆ్ కు వాటా ఉంటుంది. ఇంత పెద్ద విషయంపై ఎందుకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎవరూ మాట్లాడటం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షలు లేవా? ఉంటే మీకు చేతకాదా? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మెగా క్రిష్ణారెడ్డిగి జీతగాల్లా? మేం ఢిల్లీ వరకూ వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేసాం. కాగ్ కు కూడా నివేదిక అందించాము.  ఏ పార్టీ కూడా ఈ విషయం పై ఎందుకు మాట్లాడటం లేదు?  సీబీఐ, కాగ్ నిపుణులను నియమించి దీనిపై విచారణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మెగా క్రిష్ణారెడ్డి బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను కొనడమే కాదు, అధికారుల పిల్లల పెళ్లిల్లు ఫైవ్ స్టార్ హోుటల్లలో చేస్తున్నాడు. మీడియా, మీడియా హౌసెస్ ని మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకు ఎవరూ ప్రశ్నించడం లేదు. మేం మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నాం. ఇది మనలో ప్రతి ఒక్కరి డబ్బు. ఒక్క యాక్షన్ లేదు.. ఒక్క ఆడిట్ లేదు…. మెగా క్రిష్ణారెడ్డి ఫోర్బ్స్ జాబితాలో ధనికుడు. జీఎస్టీ వాళ్లు 70 వేల కోట్ల నల్లధనం , 12 వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉంది అని వాళ్లు చెప్పినా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో క్రేన్ వైర్ విరిగి 5 మంది చనిపోయినా, మిషన్ భగీరథలో కలుషిత నీరు తాగి చనిపోయినా ఎవరూ ప్రశ్నించడం లేదు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడరు? డబ్బులిస్తే దేనికైనా అమ్ముడుపోతారా?

మేం డైరెక్ట్ గా కాంగ్రెస్ , బీజేపీలకు ప్రశ్నిస్తున్నాం. మీలో నిజాయితీ ఉంటే, దమ్ముంటే మీరు కూడా ప్రశ్నించండి. బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ఎవరో ఒక మంత్రి వస్తారు… కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లాంటిదంటారు. నిర్మలా సీతారామన్ ఈ ప్రాజెక్టు రిడిక్యులెస్ ఫిగర్స్ అంటూ మాట్లాడుతుంది. అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు ఎందుకు విచారణ చేయడం లేదు.  మీరు దేశానికి కాపలా కుక్క కాదా? అధికారం అనుభవించడమేనా? ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగిందని తెలిసి రాష్ట్రంలోకి వచ్చి సిగ్గులేకుండా అవినీతి జరిగిందని చెబుతున్నారు. కానీ విచారణ మాత్రం చేయడం లేదు. మేం అడుగుతున్నాం గానీ ఒక సీబీఐ, కాగ్ ఈడీ దేనితో కూడా విచారణ చేయించడం లేదు. వాటర్ రీసోర్స్ మంత్రి వచ్చి అవినీతి జరిగిందని చెబుతున్నారు. నోరు ఉంది కదా అని నోటికొచ్చినొట్టు మాట్లాడితే సరిపోతుందా? అధికారం ఎందుకు ఉంది మీకు?  ఈ రోజు సిగ్గు లేకుండా మునుగోడులో ఓట్లు అడుగుతున్నారా? ఏ కార్యక్రమం సరిగా చేశారని ఓట్లు అడుగుతున్నారు?

విభజన హామీలు ఏమయ్యాయి? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఖాజీ పేట్ కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు హామీలు ఏమయ్యాయి? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు .. ఎనిమిదేళ్లకు 16 కోట్ల ఉద్యోగాలు.. మన బిడ్డలకు కనీసం 50 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా?  ఇది దేశానికి సంబంధించిన పెద్ద స్కాం.
దీని మీద ద్రుష్టి పెట్టాలి. దయచేసి ప్రతిపక్షాలు అయిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఈ విషయంపై మాట్లాడటం మీ బాధ్యత అధికారులు, మీడియా , నిపుణులు కళ్లు తెరిచి చూడండి, మీ బాధ్యత మీరు సరిగా చేయండి, మీరు ఇప్పుడు మేలుకోకపోతు రాష్ట్రం మొత్తం లూటీ అవుతుంది.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది . దీని పై విచారణ చేయడం బీజేపీ బాధ్యత. విచారణ చేపట్టకపోతే కేసీఆర్, బీజేపీ, మెగా క్రిష్ణారెడ్డికి సంబంధం ఉందన్న అభిప్రాయం ప్రజలందరికి వస్తుంది. మెగా క్రిష్ణారెడ్డి, కేసీఆర్ తోడు దొంగలైతే రేవంతర్ రెడ్డి, బండి సంజయ్ జీతగాళ్లు. ఇంత అవినీతి జరిగిందని మేం అంటున్నప్పుడు ఎలాంటి అవినీతి జరగకపోతే కేసీఆర్ తనపై సిట్టింగ్ జడ్జ్ , సీబీఐతో విచారణ చేయించుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇతర దేశానికి , రాష్ట్రానికి వెళ్తే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కూతురుని తీసుకొని వెళ్లి ఢిల్లీలో కూర్చుంటే ప్రజలు ఏం అనుకోవాలి? బిడ్డను కాపాడుకోవడం కోసం కాళ్లావేళ్లా పడుతున్నారనే అనుకుంటారు కదా? అధికారంలో ఉన్న వాళ్లు డే టూ డే షెడ్యూల్ బయట పెట్టాలి కదా?
ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారో బయట పెట్టండి? ముఖ్యంమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్లండి, దుబాయ్ లో మీ కూతురు కట్టుకున్న బుర్జ్ ఖలీఫాలకు వెళ్తారో మాకు అనవసరం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 80 వేల పుస్తకాలు చదివాను, అపర మేధావిని అని చెప్పుకుంటే సరిపోదు. ఇంగీతం ఉండాలి.

ఎన్ని మీడియా హౌసెస్ మెగా క్రిష్ణారెడ్డికి అమ్ముడుపోయాయి? మేం మెగా క్రిష్ణారెడ్డి అవినీతి గురించి ఇంతగా అడిగితే ఎవరు ఎంత కవర్ చేస్తున్నారో మీకు తెలియదా? టీవీ 9 సంస్థలో మెగా క్రిష్ణారెడ్డికి వాటా ఉంది. వాళ్లు కవర్ చేయరు. మిగతా మీడియా హౌసెస్ వాళ్లు ఎంతమంది కవర్ చేస్తున్నారు? జర్నలిస్టులు వార్తలు అందించడం కోసమే ప్రయత్నిస్తారు. కానీ మీడియా హౌసెస్ కూడా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. రాష్ట్రంలో ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా హౌస్ ఉంది. వాళ్ల అజెండా ప్రచారం చేసుకుంటున్నారు. దమ్ముండాలి, నిజాయితీ ఉండాలి .

మెగా క్రిష్ణారెడ్డి నుంచి వైయస్ ఆర్టీపీకి పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అమ్ముడుపోయేది కాదు. రాష్ట్రంలో ఒక బిడ్డకు అన్యాయం జరిగితే పట్టించుకునే వారు లేరు. కేసీఆర్ బిడ్డకు అన్యాయం జరిగితే వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. వీళ్లు పాలకులా? మనుగోడులో జరుగుతున్నది వీధిలో కుక్కల కొట్లాడ. ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదు. ఐదేళ్లు ప్రజలకు సేవ చేస్తానని ఓట్లు వేయించుకున్న ఓ దిక్కుమాలి కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేస్తే వచ్చిన ఎన్నిక ఇది. 1000 కోట్లతో దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక తెలంగాణలో జరుగుతోంది. కొలాయి తిప్పితే నీళ్లు కాదు, మద్యం ఏరులై పారుతోంది.
ఏ కారులో చూసినా కోట్లలో డబ్బులు. – సర్పంచులు, ఎంపీటీసీలు , జడ్పీటీసీలు అమ్ముడుపోతున్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా సంతలో పశువుల్లా అమ్ముడుపోతున్నారు. మీరు నాయకులు అనిపించుకోవడానికి సిగ్గనిపించడం లేదా?

మేం మునుగోడులో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ ఎస్ లకు ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిస్తున్నాం. రాహుల్ గాంధీకి మేం ముమ్మటికీ మద్దతు ఇవ్వడంలేదు. ముందస్తు ఎన్నికలు రావు, కేసీఆర్ కు అంత దమ్ము లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమస్యలు ఉన్నాయి. మేం పాదయాత్రలో కేసీఆర్ ను ఉతికి పారేస్తున్నాం. మునుగోడు కాంగ్రెస్ లో నుంచి తమ్ముడు బీజేపీలోకి వెళ్తే, అన్న కాంగ్రెస్ లో ఉండి బీజేపికి ఓట్లు వేయండి అంటున్నడు. ఏం రాజకీయాలు చేస్తున్నారు? దమ్ముంటే మీరు కూడా బీజేపీలోకి వెళ్లొచ్చు కదా? కాంగ్రెస్ ఒక మునిగిపోయిన పడవ. కాంగ్రెస్ కు ఓట్లేస్తే అమ్ముడుపోతున్నారు. పార్టీలో ఉన్న వాళ్లు పక్క పార్టీకి ఓట్లేయండని చెబుతున్నారు. మా పార్టీలో నీతి , నీజాయితీ ఉండి ప్రజలకు నమ్మకంగా పని చేసే వాళ్లు మా పార్టీలో చేరాలనుకుంటున్నాం. కేసీఆర్ కు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేంత సీన్ లేదు.

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి.
పాదయాత్రలో మేం మా వద్దకు వచ్చిన ప్రతి సమస్యపై మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేల అవినీతి గురించి ప్రజలు చెప్పుకున్నప్పుడు మేం మాట్లాడుతున్నాం. కేసీఆర్ పాలనపై నమ్మకుంటే మునుగోడులో ఒక్కో గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యేను ఎందుకు పెట్టారు? ప్రజలు ఓట్లు వేయరనే కదా ఇలా ఎమ్మెల్యేలను పెట్టుకున్నారు. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ కు ప్రచారం చేస్తున్నాడు. కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటామంటున్నారు. అది కర్ణాటకలో ఉందా? మహారాష్ట్రలో ఉందా? మీరు అధికారంలో ఉండి ఒక ప్రాంతాన్ని డెవెలప్ చేయడం కోసం దత్తత తీసుకుంటామంటారా? బీజేపీ కేంద్రంలో పథకాలను చూపించి కదా ఓట్లు అడగాలి. పాలన మీద నమ్మకం లేక డబ్బులు పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ దేశంలోనే ధనిక రాజకీయ నాయకుడు. స్కూటర్లో తిరగినోడు హెలీకాఫ్టర్లు కొంటున్నాడు? మెగా క్రిష్ణారెడ్డి లాంటి వాళ్లు ఇస్తేనే వచ్చాయి కదా? మెగా క్రిష్ణారెడ్డికి ఏమైనా బావమరిది అవుతాడా కేసీఆర్? ఎక్కడో లాభం ఉంటేనే ఇస్తారు కదా?

Also Read : మునుగోడు ఎన్నికలు బహిష్కరించండి వైఎస్ షర్మిల పిలుపు 

Also Read : కబ్జాలకు కేరాఫ్ మంత్రి పువ్వాడ.. షర్మిల విమర్శ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్