టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే వరుసగా మూడు హిట్లు కొట్టిన అరుదైన హీరోయిన్స్ లో మెహ్రీన్ ఒకరుగా కనిపిస్తుంది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ .. ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్’ సినిమాలు ఆమె క్రేజ్ ను పెంచేశాయి. ఆ తరువాత కెరియర్ కాస్త నిరాశాజనకంగా కొనసాగినప్పటికీ, ‘ఎఫ్ 2′ .. ఎఫ్ 3’ సినిమాలు ఆమెకి ఊరట కలిగించాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఇతర భాషా చిత్రాలపై .. వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టింది. అలా ఆమె చేసిన ఫస్టు సిరీస్ గా ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది.
‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ టైటిల్ చూసి చారిత్రక సిరీస్ అనుకుంటే పొరపాటే. ఇది 1965 ప్రాంతంలో గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగే డ్రామా. భారీతనం ఎక్కడా తగ్గకుండా ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందు ఉంచారు. అలాంటి ఈ సిరీస్ లో హీరోను ప్రేమించే ‘సంజన’ అనే పాత్రను మెహ్రీన్ పోషించింది. ప్రేమించే వ్యక్తికంటే .. ప్రేమను నటించేవారిని త్వరగా నమ్మేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తిని నమ్మి మోసపోయే పాత్రలో మెహ్రీన్ కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెనం పై నుంచి పొయ్యిలో పడటం వంటి పాత్రను చేసింది.
నిజానికి ఈ సిరీస్ అంతా కూడా ఆరు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 6వ స్థానంలో మెహ్రీన్ కనిపిస్తుందని చెప్పచ్చు. ఆమె పాత్ర ఇంట్రడక్షన్ గానీ .. ఎమోషన్స్ గాని అంతగా కనెక్ట్ కావు. ఒకటి రెండు సార్లు ఆమె బోల్డ్ సీన్స్ లోను కనిపిస్తుంది. కథాపరంగా చూసుకుంటే ఆ పాత్రకి ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఈ సిరీస్ తరువాత మెహ్రీన్ ఆ దిశగా బిజీ అవుతుందేమో చూడాలి.