‘colourful’ British-Sikh businessman
“సంపదలు” కొంతమందికి అనూహ్యంగా అలా వచ్చి పడుతుంటాయి.
ఈ సంపదలు ఎలా వస్తాయో, సుమతీ శతకకర్త చాలా చక్కగా చెప్పాడు.
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
సంపదలు కొబ్బరికాయలో నీళ్ళలా తెలియకుండా వచ్చేస్తుందని, అలాగే పోయేటప్పుడు కూడా ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జులా మాయం అవుతుందట.
కాని సంపద వచ్చేటప్పుడు ఒంటరిగా రాదు.
ఒక్కోసారి దాన గుణాన్ని, ధర్మాన్ని వెంట తెస్తుంది.
మరోసారి పైత్యాన్ని, ప్రచార-పటాటోప కాంక్షను తెస్తుంది.
ఎవరి దగ్గరకి ఏమి తెస్తుంది అనేది వారి వారి ఖర్మను, ఇక వారి పాలిట పడే మన ఖర్మ ను ఆధారంగా నిర్ణయింప బడుతుంది అనుకోండి..
సంపద వెంట పైత్యం వస్తే.. ఇక వారి వికారాలు చూడడానికి, వినడానికి, తెలుసుకోడానికి మన జ్ఞానేంద్రియాలు చాలవు.
ఈ సంపదను ప్రదర్శించడానికి వొంటినిండా బంగారం దిగవేసుకునేవాడు ఒకడు..
ఓ నలుగురి కుటుంబం ఉండడానికి 27 అంతస్తులతో, 4,00,000 చదరపు అడుగుల బంగ్లా నిర్మించుకొనే వాడు ఒకడు..
పట్టు చీరలు, చెప్పుల జతలలో బీరువాలు నింపే వారొకరు.
వజ్రాలు పొదిగిన, కోట్ల విలువ చేసే దుస్తులు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొనే వారు మరి కొందరు..
మరుగు దొడ్లు సైతం బంగారంతో నిర్మించేవారు ఇంకొందరు..
చెప్పుకొంటే ఇలా చాలా ఉన్నాయి..
అన్నిటికి పరాకాష్ట లండన్ లో మన భారత సంతతికి చెందిన “రూబెన్ సింగ్” గారి వికారం.
ఆయన ఈమధ్య “ఒక తలపాగా” సవాల్ ను చేపట్టారట.
అంటే ఆయన ఏ రంగు తలపాగా చుట్టుకొంటారో, అదే రంగు కారులో ప్రయాణించడమే ఈ సవాల్ అట.
దానికోసం ఇప్పటికే లెక్కకు మించి గ్యారేజ్ లో ఉన్న కార్లకు జతగా మరో 6 కార్లు కొని పడేశారట.
కార్లు అంటే ఎదో మన మారుతి సుజుకిలు కాదండోయ్.. లగ్జరీ రోల్స్ రాయస్ లు
Famous for matching his turbans to his Rolls-Royce
“ఇంత అవసరమా” అని ఆలోచించే మనబోటి వాళ్లకు ఓ జీవిత సత్యం కూడా సదరు సింగ్ గారు చెప్పారట. దాని సారాంశం ఏమంటే “ఎవరికీ ఇబ్బంది లేనప్పుడు మనకు నచ్చింది చేయడమే మంచింది” అని.
ఈ మహానుభావుడికి
“తల్లి గర్భము నుండి ! ధనము తేడెవ్వడు !
వెళ్ళి పోయెడి నాడు ! వెంట రాదు !
లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !
మెరుగు బంగారంబు ! మింగ బోడు !
విత్తమార్జన జేసి ! విర్రవీగుటె కానీ !
కూడ బెట్టిన సొమ్ము ! కుడవ బోడు !
పొందుగా మరుగైన- భూమి లోపల బెట్టి !
దాన ధర్మము లేక ! దాచి దాచి !
తుదకు దొంగల కిత్తురో- దొరల కవునో !
తేనె జుంటీగ లియ్యవా- తెర వరులకు !
భూషణ వికాస ! శ్రీ ధర్మపురి నివాస !
దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !!”
అని చెప్పిన మన నరసింహా శతక కర్త గురించి తెలిసే అవకాశం ఎలానో లేదు.
కనీసం సిక్కు గురువులు చెప్పిన “గుర్బాని నీతుల”లో
“మాటీ కా కైసే నాచత్ హై, దేఖై, దేఖై ,సునై, బోలై దా-ఓరి-ఫిరత్ హై.. జబ కుచ్ పావై తబ్ గర్వ్ కరత్ హై, మా- యి-ఆగా ఏ తబ్ రోవన్ లగత్ హై, మన్ బచ్ కరం రస్ కసే లుభానా, బినాస్ గా ఐ ఆజా యే కహూన్ సమానా” ( మట్టి బొమ్మ లాంటి ఈ మనిషి చూడు ఎలా అడతాడో, ఎప్పుడైనా ఏదైనా సంపద లభించగానే ఎక్కడలేని గర్వం తో దాన్ని చూస్తూ, దాని గురించే మాట్లాడుతూ, దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అతని ప్రతి మాట, చర్య ఆ సంపద ఇచ్చిన పొగరు తోనే నిండి ఉంటుంది. కాని అతడు మరినిన్స్తే ఎక్కడకు పోయాడో కూడా ఎవరికీ తెలియదు) అయినా విన లేదా?
రాజులు పోలేదా..
రాజ్యాలు పోలేదా..
సంపదతో విర్రవీగిన వారుపోలేదా..
పోయిన వారు తాము సంపాదించింది తీసుకు పోవడం ఎవరైనా చూసారా?
ఏమి తీసుకుపోయేది ఏదని చెప్పదానికేగా “అలెగ్జాండర్ ది గ్రేట్” తన శవ పేటిక నుంచి రెండు చేతులు బయట పెట్టమన్నది.
ఎలాగో తీసుకు పోయేది లేదు.. కాబట్టే నేమో మన “రుబెన్ సింగ్ గారు” కార్ల రూపంలో అనుభవిస్తున్నట్లున్నాడు.
మన కంచర్ల గోపన్న చెప్పినట్లు..
సిరిగలనాడు మైమఱచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చుపై
గెరలినవేళదప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త
త్తరమునద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!
సంపదలు ఉన్నరోజు పుణ్యకార్యాలు చేయడం మానవేసి, లేని నాడు అయ్యో ఆరోజు ఏమి చేయలేకపోయానని బాధ పడడం, ఇల్లు కాలేటప్పుడు బావి తవ్వడం లాంటి దేనట.
మరి మన రూబెన్ గారికి తలపాగా కలర్ కు సరిపోయే కారు కొనడం కంటే కాలే కడుపులు నింపితే ఇంకా ఆనందం వస్తుందని ఎప్పుడుకి తెలుస్తుందో.
-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ
Also Read:
Also Read:
Also Read: