Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅనంతవాయువుల్లో ప్రాణవాయువు

అనంతవాయువుల్లో ప్రాణవాయువు

Covid Deaths in India :

గెలుపు అందరికీ కన్నబిడ్డే.
ఓటమే అనాథ.
ఓటమి..మరణం ఒకటేకదా!
అందుకే.. ఇప్పుడు మరణం కూడా అనాథే.
అనాథలా మరణించినా..
అందరూవుండి మరణించినా..
మరణం ఇప్పుడు అనాథే.
మరణిస్తే జనాభా లెక్కలనుంచి తీసేస్తారు.

అసలు మరణానికే లెక్కలు లేకపోతే..
ఏ జనాభా నుంచి తొలగిస్తారు?
మన పిచ్చి గానీ..
ప్రాణాలకు లెక్కలేని దేశంలో
మరణాల లెక్కలగురించి దిగులెవడికి?
ఇక్కడ విషాదం కేవలం మరణమే కాదు.
ఇప్పుడు విషాదం కేవలం మనిషి కనుమరుగైపోవడమే కాదు.
ఆ మరణానికి లెక్కలేకపోవడం…

ఎంతమంది మరణించారో లెక్కలు లేకపోవడం…
ఎలామరణించారో లెక్క తెలియకపోవడం…
జనం చస్తున్నా ప్రభుత్వాలకి లెక్కలేకపోవడం.
ఆక్సిజన్ లేక ఎందరు చనిపోయారే ప్రభుత్వం దగ్గర లెక్కలేదు.
ఎందుకంటే, రాష్ట్రాలు లెక్కలివ్వలేదు.
రాష్ట్రాలెందుకు ఇవ్వలేదు?
ఆస్పత్రుల్లో ఆ లెక్కలేదు.
ఎలా వుంటుంది?

కరోనాతో పోయిన వాళ్ల లెక్కే పూర్తిగా లేదు.
ఇంక ఎలా పోయారో రాస్తారా?
ఆక్సిజన్ లేక పోయారని..
మందులు లేకపోయారని..
ఆస్పత్రి బెడ్లు లేక పోయారని..
కార్పొరేట్ ఆస్పత్రుల స్వార్థం వల్ల పోయారని..
దిక్కుమాలిన స్టెరాయిడ్ల వల్ల పోయారని..
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పోయారని..
సమయానికి టెస్టు రిపోర్టు రాక పోయారనీ…
అంబెలెన్స్ దొరక్క దారిలోనే పోయారని..
ఎవరు రాస్తారు..?
ఎలా రాస్తారు?
ఈ గుండెకోతలకు రాతకోతల్లేవు..
అనంతకోటి గణాంకాల్లో.
ప్రాణం ఒక శూన్యాంశం.

అయినా ఎన్నిలెక్కలని గుర్తుపెట్టుకుంటాం?
ఎన్ని లెక్కలని చిట్టారాస్తాం?
అసలు మనకు తెలిసిన లెక్కలెన్నని?
గత ఏడాది లాక్ డౌన్ తీసిన ప్రాణాల లెక్కతెలుసా?
వేలకిలోమీటర్ల కాలినడకలో రైలుపట్టాలపై ముక్కలైన
దేశదిమ్మరుల లెక్క తెలుసా?
రెక్కాడక..డొక్కాడక..
ఆకలికి ఆగిపోయిన దిక్కులేని ఉపిరుల లెక్క తెలుసా?
జబ్బు లేకపోయినా.. బతకడానికి డబ్బు లేక
వాసాలకు వేలాడిన ఆత్మహత్యల లెక్కతెలుసా?
పోనీ.. పవిత్రగంగానదిలో కొట్టుకొచ్చిన శవాల లెక్క తెలుసా?
స్మశానాల దగ్గర క్యూకట్టిన శవాల సంఖ్య ఎంతో తెలుసా?
లేకపోవడమే మంచిదేమో.
ఈ లెక్కలన్నీ తెలియకపోవడమే మంచిదేమో.
నిజంగా ప్రభుత్వాలు ఈ లెక్కలన్నీ చెప్తే..
ఉన్న గుండెలాగిపోవా?

-కె. శివప్రసాద్

Read More: కాచుకోండి! కరోనా వేవ్ లు ఇంకా చాలా ఉన్నాయట!

Read More: గౌర‌వ మ‌ర‌ణాన్ని ఇవ్వండి మోదీ సార్‌!

Read More: గ్యాస్ సిలిండర్లలా ఇక ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్