Pegasus spyware: Another indicator of the fragility of democracy
2017 ఇస్రాయెల్, మోడీ పర్యటన చివరి రోజు.
చల్లని సాయంత్రం, సముద్రతీరం.
నెతన్యాహు, మోడీ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న దృశ్యం.
ఇస్రాయెల్ గడ్డ మీద అడుగు పెట్టిన మొదటి ప్రధానిగా సృష్టించిన చరిత్ర.
ఇదంతా…భారత విదేశాంగ విధానంలో విప్లవాత్మక మార్పు అనుకోవాలి.
అంతేకానీ, ఆ ఇసుక తిన్నెల మీద పెగాసస్ అమ్మకాల చర్చ జరిగిందంటే ఎలా
నమ్ముతాం?
2021ఫిబ్రవరిలో మోడీ సర్కార్ కొత్త సోషల్ మీడియా చట్టం తెచ్చింది.
వాట్సప్, ఫేస్ బుక్, ట్విటర్…
ఇవన్నీ ప్రభుత్వం ముందు తమ గుట్టు విప్పాల్సిందే అని ఆ చట్టం సారాంశం.
సోషల్ మీడియా అరాచకాలను అరికట్టడానికి మోడీ చూపించిన ధైర్యం ఇది..
అంతేకానీ, అంతకురెండేళ్ల ముందే పెగాసస్ మీద వాట్సప్ కేసు వేసింది.
వ్యక్తిగత గోప్యతకి వాట్సప్, ట్విటర్లు అంతగా ప్రాధాన్యమివ్వడం మోడీకి నచ్చలేదని ఎవరైనా చెప్తే అసలు నమ్మగలమా?
ప్రతిపక్షాలకు పనీ పాటా లేదు.
పెగాసస్ పేరుతో పార్లమెంటు టైమ్ వృధా చేస్తున్నాయి.
ఇది ప్రభుత్వ అభిప్రాయమే కాదు.
దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా ఇదే.
ఇంకేం సమస్యలు లేవా?
అయినా ఈ నేతల ఫోన్లలో ఏం రహస్యాలుంటాయి?
వాటిని ప్రభుత్వం వింటే తప్పేంటి?
అని చాలా మంది చదువుకున్న వాళ్లే ప్రశ్నిస్తున్నారు.
అంతగా ప్రభుత్వాన్ని తిట్టాలనే అనుకుందాం.
కోవిడ్ వుంది.
అందులో ప్రభుత్వ వైఫల్యం వుంది.
వాటి గురించి మాట్లాడొచ్చుకదా?
అని కొందరు సెమీమేధావుల చిరాకుపడుతున్నారు.
దేశంలో ఇంకా ఆకలి, దరిద్రం అలాగే వున్నాయి.
ఆస్పత్రులు, ఆక్సిజన్ లకే దిక్కులేదు.
ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు.
వచ్చినా ఎన్నాళ్లుంటుందో గ్యారంటీ లేదు
ఇన్ని కష్టాల మధ్య ఫోన్లో సమాచారం వుంటే ఎంత? పోతే ఎంత?
అయితే, గియితే ఇది రాహూల్ గాంధీ, సోనియా గాంధీ సమస్య.
మమతాబెనర్జీ, ప్రశాంత్ కిషోర్ గొడవ.
ఇంకొందరు జర్నలిస్టులుండొచ్చు.
హక్కులు, ఉద్యమాలు అంటూ తిరిగేవాళ్లకి ఇబ్బంది కావచ్చు.
కానీ, సామాన్యజనానికి దీంతో వచ్చిన నష్టం ఏంటి?
వాళ్ల ఫోన్లో ఏముందో ఏం లేదో ప్రభుత్వం పట్టించుకుంటుందా?
అసలు ఇదంతా ప్రభుత్వమే చేస్తోందని గ్యాంరటీ ఏంటి?
నలుగురు కూడిన రచ్చబండల్లో వినపడుతున్న ప్రశ్నలే ఇవన్నీ.
సుప్రీమ్ కోర్టు ప్రధానన్యాయమూర్తి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన ఉద్యోగిని ఫోన్..
ప్రధాని మోడీ ఎన్నికల నియామవళి ఉల్లంఘించారని నోటీస్ ఇచ్చిన ఎన్నికల అధికారి ఫోన్..
హిందుత్వ వాదే అయినా మోడీకి బద్ధశత్రువుగా ముద్ర పడ్డ ప్రవీణ్ తోగాడియా ఫోన్..
మోడీని దించుతానని ప్రతిజ్ఞచేసిన ప్రశాంత్ కిషోర్ ఫోన్..
పశ్చిమ బెంగాల్ లో హోరీహోరీ పోరాడి, బిజెపిని ఓడించిన మమతా బెనర్జీ (అనుచరుడి)ఫోన్..
మోడీ సర్కార్ నిర్ణయాలని ఎప్పటికప్పుడు విమర్శించే జర్నలిస్టుల ఫోన్లు..,
జనం హక్కుల కోసం పోరాడే ఉద్యమకారుల ఫోన్లు,
ప్రతిపక్ష నాయకుల ఫోన్లు..
Pegasus spyware :
పెగాసస్ అటాక్ చేసిన ఫోన్లే ఇవన్నీ..
ఈ పని ప్రభుత్వం ఎందుకు చేస్తుందని ప్రశ్నించేవాళ్లకి చెప్పగలిగే సమాధానం ఏముంటుంది?
నిజమే ప్రజలకు చాలా సమస్యలు వున్నాయి.
ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం, ఇంకా ఇంకా…చాలా వున్నాయి.
కానీ ఆ సమస్యల గురించి ప్రజలు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు.
దానికి వ్యవస్థలు కావాలి.
ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు సరిదిద్దే
కోర్టులు, ఎన్నికల సంఘాలు, నిఘా సంస్థలు వుండాలి.
ప్రభుత్వాలు చేసేతప్పుల్ని చెప్పగల మీడియా వుండాలి.
ప్రజలకు అండగా నిలబడే యాక్టివిస్టులు కావాలి.
చట్టసభల్లో ప్రభుత్వాన్ని ఎదిరించే ప్రతిపక్షాలుండాలి.
వీటన్నినీ దొంగదెబ్బ తీసేదే పెగాసస్
వీటి గుట్టుమట్లని గుప్పిట్లో పెట్టుకునేదే పెగాసస్.
ఈ వ్యవస్థలన్నిటీనీ కీలుబొమ్మల్లా ఆడించే కుట్ర పేరే పెగాసస్.
ఇవన్నీ కుప్పకూలితే, సోకాల్డ్ నిజమైన ప్రజాసమస్యలు మాట్లాడ్డానికి ఇంకెవరూ మిగలరని ఈ జనానికి ఎవరుచెప్పాలి?
వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు.
దాన్ని ఉల్లంఘించే అధికారం ప్రధాన మంత్రికి కూడా లేదని ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పాలి?
పెగాసస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఆయుధం.
ప్రభుత్వాలకి తప్ప ప్రైవేటు వ్యక్తులకి అమ్మరు.
పైగా ఇస్రాయెల్ ప్రభుత్వ అనుమతి తోనే వీటిని ఇతరప్రభుత్వాలకి అమ్ముతారు.
పెగాసస్ కొనలేదని ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం చెప్పడం లేదు.
ఈ వ్యవహారం మీద విచారణ జరిపిస్తామని కూడా ప్రకటించలేదు.
అయినా ప్రధానికి దీంతో ఏం సంబంధం అడిగేవాళ్ళకి ఏం చెప్పగలం?
-కే.శివప్రసాద్
Also Read:ప్రజలు గెలిచేదెప్పుడు?
Also Read: అనంతవాయువుల్లో ప్రాణవాయువు