Road Map Row: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసలు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బిజెపితో పొత్తులో ఉన్నారా, టిడిపితో కలిసి ఉన్నారా, లేదా ఒంటరిగా ఉన్నారో తేల్చి చెప్పాలని పవన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అంబటి స్థానిక శ్రీధర్ గార్డెన్స్ లో జరిగిన రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రీజినల్ ఇన్ ఛార్జ్ బాలినేని శ్రీనివాసులురెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటున్న పవన్, ఆత్మకూరులో ఆ పార్టీ పోటీ చేస్తుంటే వాళ్ళను రోడ్డు మీద ఒదిలేసి ఎందుకు వేరే పార్టీవైపు చూస్తున్నారని అంబటి నిలదీశారు. ఆత్మకూరులో తమ పార్టీ రికార్డు మెజార్టీతో విజయం సాధిస్తుందని రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. పవన్ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో పార్టీ కార్యకర్తలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలను, కార్యకర్తలను ఆయన మోసం చేస్తున్నారని ఆరోపించారు. బిజెపిని వదిలి తెలుగుదేశం పార్టీతో వెళ్లాలనుకుంటున్న పవన్ దమ్ముంటే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఎప్పటినుంచో చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారని అంబటి విమర్శించారు.
Also Read : దివాళా తీయించి ఇచ్చారు: రాంబాబు విసుర్లు