తమిళనాడులో జయలలిత చనిపోయినా ఆమె ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటిన్లు నడుపుతున్నారని, కానీ ఇక్కడ అన్నా క్యాంటిన్లపై జగన్ కు ఎందుకంత కోపమని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు నేడు కృష్ణానంద పల్లి, గుండ్ల నాయనపల్లి, కొత్తూరుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నాశనమైందని, ఏ వ్యవస్థ పనిచేయకపోయినా చేయించే సత్తా తనకుందని వ్యాఖ్యానించారు. తాము చట్టాన్ని గౌరవిస్తున్నామని, తమ మంచితనాన్ని అసమర్ధతగా తీసుకోవద్దని హెచ్చరించారు. బ్రిటీష్ వారికి, మీకు తేడా ఏముందని నిలదీశారు.
కుప్పంలో నిన్నటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, వైసీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడ్డారని విమర్శించారు. జగన్ లాంటి వాళ్ళను తాను ఎంతో మందిని చూశానని, తాను ఇక్కడే ఉంటానని జగన్ రావాలని, అవసరమైతే పులివెందుల నుంచి రౌడీలను తెచ్చుకోవాలని సవాల్ చేశారు.
కుప్పంలో మోడల్ కాలనీకి తాను శ్రీకారం చుట్టానని 650 ఇళ్లు తాము నిర్మించామని, ఇంకా కొందరు తమకు కూడా ఇళ్లు కావాలని అడిగితే వన్ ప్లస్ త్రీ విధానంలో మొత్తం మూడు వేల మందికి ఇళ్లు నిర్మించాలని వంద కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని చెప్పారు. కొందరు చోటా మోటా నాయకులు కుప్పంలో అతి చేస్తున్నారని, ఈ నేతలకు దమ్ముంటే జగన్ దగ్గరకు వెళ్లి దీనిపై మాట్లాడాలని సూచించారు. కుప్పంపై ఎందుకింత కక్షతో వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కుప్పంలో బాబు మూడురోజుల పర్యటన నేటితో ముగియనుంది.
Also Read : కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత