ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఓ అరుదైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ లోని శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎనిమిది చిరుత పులులను వదిలారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను మరో ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతపులులను ఇక్కడి కునో నేషనల్ పార్క్ లో విడిచి పెట్టారు. ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందుగా నమీబియా నుంచి చిరుతలు కునో ప్రాంతానికి చేరుకోన్నాయి. గ్వాలియర్ ఎయిర్ ఫోర్సు స్టేషన్ వరకు కార్గో విమానంలో తీసుకురాగా కునో ప్రాంతంలో తాజాగా 10 హెలీప్యాడ్ లు నిర్మించారు. దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి నమీబియా చిరుతపులులు మధ్యప్రదేశ్ కు వచ్చాయి.
నమీబియా నుంచి వచ్చే కన్నా ముందే చిరుత పులులకు చిప్ అమర్చారు. చిరుతల రక్షణకు, వారి కదలికలు తెలుసుకునేందుకు చిప్ ద్వారా పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కునో నేషనల్ పార్క్ చిరుతల జీవనానికి అనుగుణంగా ఉన్నందునే అక్కడికి తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1952 నాటికే భారత దేశంలో చిరుతలు కనుమరుగయ్యాయి.
ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కునో ప్రాంతంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు సెప్టెంబరు 14 నుంచి 20వ తేదీ వరకు ముందే బుక్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు వేడుకలు, చీతా ప్రాజెక్టు ద్వారా కునో జాతీయ పులుల పార్క్ లో జరుపుకున్నారు.