Sunday, January 19, 2025
HomeTrending NewsSkill Case: ఒక్క ఆధారమూ లేదు: లోకేష్

Skill Case: ఒక్క ఆధారమూ లేదు: లోకేష్

ఏసీ బస్సులో తిరిగినంత మాత్రాన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం.. న్యాయం కాబోదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు లో చంద్రబాబును కలుసుకున్న లోకేష్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై స్పందించారు. ఎంతోమంది దళితులు ఈ ప్రభుత్వంలో ప్రాణాలు కోల్పోయారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ముందు వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే టిడిపి కార్యకర్తలు నల్ల జెండాలు ధరించి వైసీపీ యాత్రకు నిరసన తెలియజేస్తున్నారని అన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పటికి 50 రోజులైనా ఒక్క ఆధారం కూడా బైటపెట్టలేకపోయారని, బాబు చేసిన తప్పు ఏమిటో నిరూపించలేకపోయారని అన్నారు. ఫైబర్ నెట్ కేసులో కూడా తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో కూడా రెండురోజుల పాటు సిఐడి తనను కొన్ని ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారని, రెండోరోజు తనను ఒక్కడినే నాలుగు గంటలపాటు ఖాళీగా కూర్చోబెట్టారని అన్నారు.

జగన్ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేసి బాబును జైల్లోనే ఉంచుతోందని ఆరోపించారు. సిబిఐ కేసుల్లో జగన్ పదేళ్ళ నుంచీ బెయిల్ పై ఉన్నారని, వివేకా హత్య కేసులో ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ కనీసం అరెస్ట్ కూడా చేయలేకపోయిందని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబుకు మొదటినుంచీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కానీ, ఈ ప్రభుత్వం ఆయన హెల్త్ బులెటిన్ లో నిజాలు దాస్తోందని, బాబు కంటికి శస్త్ర చికిత్స అవసరమని కంటి వైద్యుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ ప్రభుత్వం మేజేజ్ చేసి రెండోరోజే అదే వైద్యుడితో మరో నివేదిక ఇప్పించిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చేయించే వైద్యంపై, వైద్య పరీక్షలపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు.

కేవలం బాబును ప్రజల్లోకి వెళ్ళకుండా చేసేందుకే అరెస్ట్ చేశారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని లోకేష్ తేల్చి చెప్పారు. బాబు ఎప్పుడు విడుదలవుతారో అనేది సామాన్య ప్రజలతో పాటు తానూ ఎదురు చూస్తున్నానని అన్నారు. చంద్రబాబు చనిపోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని, ఆ పార్టీ ఎంపి గోరంట్ల వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని లోకేష్ గుర్తు చేశారు.  భువనేశ్వరిని కూడా అరెస్ట్ చేయాలంటూ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్