Friday, April 19, 2024
HomeTrending Newsవిరివిగా రుణాలు ఇవ్వాలి: సిఎం విజ్ఞప్తి

విరివిగా రుణాలు ఇవ్వాలి: సిఎం విజ్ఞప్తి

Give more: కోవిడ్‌ ప్రభావం తగ్గుతున్న ఆర్థిక వ్యవస్థ కొద్దీ తిరిగి కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని, అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీని కారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడిచమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు.  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా బ్యాంకులు విశేష కృషిచేయాల్సిన అవసరం ఉందని, తక్కువ వడ్డీలకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 219 వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం సిఎం జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగింది, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది. 2022–23 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 3,19,480 కోట్ల రూపాయలు కాగా ఇందులో 51.56శాతం (రూ.1,64,740కోట్లు) వ్యవసాయ రంగానికి; మొత్తంగా ప్రాథమిక రంగానికి 73.76శాతం (రూ. 2,35,680 కోట్లు) కేటాయించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5శాతంగా ఉందన్నారు. 2021–22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53శాతమే రుణాలు అందాయని,  వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధపెట్టాలని సిఎం కోరారు. రైతులు, కౌలు రైతులు సాగుచేస్తున్న ప్రతి కమతాన్ని కూడా ఇ–క్రాపింగ్‌ చేస్తున్నామని,  సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చని, ఈ డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి, బ్యాంకర్లు అండగా నిలవాలని కోరారు. ఆర్బీకేలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఇద్దరూ కూడా కౌలు రైతులకు ఈ విషయంలో సహాయకారిగా నిలవాలన్నారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలు, యాంత్రీకరణ, చిరు వ్యాపారులు, హస్తకళలవారికివడ్డీ లేని రుణాలు, ఎంఎస్ఎంఈ, గృహ నిర్మాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, డ్రోన్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, హార్బర్లు, పోర్టులు తదితర రంగాలకు బ్యాంకర్లు ఊతమివ్వాలని కోరారు.  వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోకూడదని సిఎం బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు.  ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీచేసిందని గుర్తు చేశారు.  ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యంకోసం ఈ పథకాలు అమలు చేస్తున్నామని, ఈ అంశాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. కోవిడ్‌ సమయంలో బ్యాంకులు ప్రభుత్వానికి చాలా బాగా సహకరించినందుకు బ్యాంకర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు సిఎం జగన్.

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎం ఎం నాయక్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ నిధు సక్సేనా, ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్‌ కె నిఖిల, నాబార్డు సీజీఎం ఎం ఆర్ గోపాల్‌, పలు ఇతర బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Also Read : కొనుగోలు విషయంలో రైతుకు స్వేఛ్చ

RELATED ARTICLES

Most Popular

న్యూస్