Friday, April 26, 2024
HomeTrending Newsరాజీనామాకు నేను రెడీ - ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాజీనామాకు నేను రెడీ – ఎంపీ రఘురామకృష్ణంరాజు

గతంలో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల మూకుమ్మడి రాజీనామాలకు ప్రతిపాదన చేయాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలుదామన్న ఆయన, ముగ్గురు టీడీపీ ఎంపీలను రాజీనామాకు ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు . రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలకు గాను 25 మంది ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా కేంద్రం పై వత్తిడికి తీసుకు వద్దామని సూచించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని విస్మరిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పి తమ పార్టీ ఎంపీల చేత జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించాలని సూచించారు. తనని పార్టీ సభ్యుడిగా పరిగణలోకి తీసుకోకపోయినప్పటికీ, రాజీనామా చేయడానికి సిద్ధమేనని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి పాలన అంతా తిరోగమన దిశలో సాగుతుందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఎన్నికలకు ముందు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే 50 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించిన తర్వాత ఆ పనులు ఎవరి చేత చేయిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. పదవ తరగతి వరకు చదివిన వాలంటీర్లతో ఆ పనులన్నీ చేయిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్, మున్సిపల్ డ్రాయింగ్ లతో పాటు, రేపు ఉపాధ్యాయులు సమ్మెకు దిగితే, విద్యార్థులకు పాఠాలను కూడా వాలంటీర్లతోటే చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. అక్కరకు లేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి, అవసరమైన ఉద్యోగులను తొలగించడం ఏమిటని నిలదీశారు.

సీమవాసులను చూస్తే జాలి వేస్తోంది

రాయలసీమ వాసులను చూస్తే జాలి వేస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాజధాని అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉందన్న ఆయన, ఉత్తర ప్రదేశ్ లో హైకోర్టు అలహాబాదులో ఉందని గుర్తు చేశారు. అంతమాత్రాన వాటిని న్యాయ రాజధానులు అని పిలుస్తారా అంటూ ప్రశ్నించారు. కొంతమంది బుద్ధిహీనులు పిచ్చి ప్రేలాపనలతో ప్రజలని మభ్య పెట్టాలని ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు ఏర్పాటుపై మాట మార్చిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని నివేదించారని పేర్కొన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయబోమని చెబుతూనే, మరొకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో ఇద్దరు సలహాదారులను నియమించిందన్న ఆయన, ఆ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారికి కూడా సలహాదారులుగా నియమించాలని సూచించారు. కర్నూలు గర్జన మాదిరిగానే బీసీ గర్జన కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కి త్వరలోనే నోటీసులు అందే అవకాశాలు ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్