Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

భారత దేశ చరిత్రలో తొలిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణ కి భారీ పెట్టుబడి దక్కింది. 24 వేల కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలేస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో మంత్రి కే తారకరామారావు తో జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకుంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలేస్ట్ కంపెనీ ఈ పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో ఈ డిస్ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయనున్నది. దేశంలో ఫ్యాబ్ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలేస్ట్ చరిత్రకెక్కనున్నది.ఎలెస్ట్ కంపెనీ ప్రపంచ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఏలేస్ట్ కంపెనీ అమొలెడ్ డిస్ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో ఉన్న ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల శాస్త్ర సాంకేతికతల మేరకు తన ఉత్పత్తులను తయారు చేయనున్నది. మంత్రి కే తారకరామారావు సమక్షంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం (generation) అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ పెట్టుబడి ద్వారా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, మరియు లాప్టాప్ వంటి డిస్ప్లే లను తయారు చేయనున్నది.

డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు రానున్న ఈ పెట్టుబడి ద్వారా కేవలం తెలంగాణను మాత్రమే కాకుండా భారతదేశాన్ని సైతం చైనా, అమెరికా, జపాన్ వంటి అతికొద్ది దేశాల సరసన నిలబెడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు తెలంగాణకు వస్తున్న ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణమన్నారు. భారతదేశ సెమీకండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఈ రోజు తమ కృషి ఫలించి, ఎలేస్ట్ కంపెనీ పెట్టుబడి ప్రకటన చేసిందన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్
రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ ఈకోసిస్టం మరియు దాని అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఈ అతిపెద్ద పెట్టుబడి ప్రకటన తర్వాత సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలువబోతున్నదన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్ప్లేఫ్యాబ్ వలన ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్ లో 3000 మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రాజేష్ ఎక్స్పోర్ట్ చైర్మన్ రాజేష్ మేహత అన్నారు. దీంతోపాటు డిస్ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, ఈ రంగ అనుబంధం సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలేస్ట్ కంపెనీ, ఆరవ తరం అమోల్డ్ డిస్ప్లే తయారీ ద్వారా భారతదేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలేస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Also Read వెయ్యి కోట్లతో తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్