Thursday, April 25, 2024
HomeTrending Newsగుజరాత్ లో మొదటి విడత పోలింగ్ ప్రారంభం

గుజరాత్ లో మొదటి విడత పోలింగ్ ప్రారంభం

గుజరాత్  శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతాంగం 8 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శీతాకాలం కావటంతో పట్టణ ప్రాంతాల్లో వోటర్లు ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. గురువారం (డిసెంబర్ 1) జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడుతలో సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.  788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం అధికారులు 14,382 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేశారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ సహా 36 రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలపగా.. ఆప్‌ 88 స్థానాల్లో బరిలోకి దింపింది. ఒక అభ్యర్థి మాత్రం నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకొన్నారు. ఇక బీఎస్పీ 57 మందిని ఈ ఎన్నికల్లో నిలబెట్టింది.మరోవైపు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఎన్నికలు త్రిముఖ పోరుగా నిలిచాయి. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుండగా.. పునర్వైభవాన్ని చూపాలని కాంగ్రెస్‌ చూస్తోంది. ఇక అధికారమే లక్ష్యంగా ఆప్‌ బరిలో నిలిచింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల కంటే బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టాలంటే.. ఈ ఎన్నికల్లో గెలవాల్సి ఉంది. సొంత రాష్ట్రంలోనే మోదీ, షా ఓడితే.. ఆ ప్రభావం పార్టీపై జాతీయ స్థాయిలో పడుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. లక్షల కోట్ల ప్రాజెక్టులతో గుజరాత్‌పై వరాలు కురిపించారు. బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని నిపుణులు అంటున్న నేపథ్యంలో.. గుజరాత్‌ ప్రజలు ఏం చేస్తారో అని బీజేపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ, క్షత్రియులు, ముస్లింలే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్‌ గతంలోనూ ప్రయోగించి సక్సెస్ అయింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సహా తదితరులు పార్టీ గెలుపు కోసం బాగానే ప్రచారం చేశారు. ప్రజలకు భారీ హామీలు ఇచ్చారు. కాంగ్రెస్‌ను గుజరాత్‌ ప్రజలు గెలిపించే అవకాశాలు లేకపోలేదు. పంజాబ్‌లో గెలిచిన ఊపుతో ఆప్‌ గుజరాత్‌లో పోటీ చేస్తోంది. ఢిల్లీ మాడల్‌ పాలనను చూపిస్తూ.. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ కూడా ప్రజలను ఆకర్షించే హామీలను ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్