Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Jeevan Reddy Fires : కాలేశ్వరం ప్రాజెక్టు నీరు కేవలం సీఎం కేసీఆర్ సొంత మెదక్ జిల్లాకు ఉపయోగపడుతోందని..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎకరం భూమి సాగుకు ప్రయోజనం కలగడం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ ఫామ్ హౌస్ కు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్ కు, నీళ్లు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. ధర్మపురిలో జరిగిన విలేఖరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి నదిపై కుదిరిన ఒప్పందం మేరకు తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా, నది ఎగువ ప్రాంతంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా అక్కడ నీటి లభ్యతను విస్మరించి 100 మీటర్ల దిగువన కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కోసమే అని ఆరోపించారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ సొమ్మును ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు అంటూ ఉద్యమాన్ని ఉధృతం చేసిన కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కూడా అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కేసిఆర్ దోచి పెడుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కాలేశ్వరం, మేడిగడ్డ, పర్యటక ప్రాంతంగా అవుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయించుకున్న్ననారని మండిపడ్డారు.  అందుకే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం లేదని ఆరోపించారు. త్వరలో ఏర్పాటు కానున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, మరే ఇతర ప్రభుత్వం కానీ అధికారంలోకి రాగానే తుమ్మిడిహెట్టి, వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

రోళ్ల వాగు ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేదని, జీవన్ రెడ్డి విమర్శించారు. నిర్మాణ వ్యయం 164 కోట్లకు పెరిగింది తప్ప రైతాంగానికి ఒరిగింది లేదన్నారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక రైతాంగం అవస్థలు పడుతున్నారన్నినారు. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ లో D-70 నుంచి D.94 కాలువ డీ లింక్ చేయగలిగితే పైన మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి అవస్థలు ఉండవన్నినారు. కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టు పెద్దపల్లి, మంథని వరకు ఆయకట్టు చివరి భూములకు నీరు అందుతుందన్నారు. సాగునీటి వినియోగంలో లస్కర్ ల పాత్ర కీలకమని 28 మంది ఉండాల్సిన జగిత్యాల డివిజన్లు కేవలం నలుగురు ఉన్నారని ఆరోపించారు. స్వర్గీయ మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సాగునీటి కోసం 10 ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేపడితే అవి నిర్వీర్యంగా మారాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్తశుద్ధితో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పర్యవేక్షణ ఉండాలని ఆ ప్రాజెక్టులను వినియోగంలోకి తేవాలని ఎమ్మెల్సీ అన్నారు. అక్క పెళ్లి రిజర్వాయర్ ఎత్తిపోతల పథకంకు నిధులు కేటాయించడం అభినందనీయమని, నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకలలో ఇది కూడా చేరుతుంది ఏమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోనే రైతులను దోచుకున్నారని, ధర్మపురి నియోజకవర్గంలో ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల వడ్లను క్వింటాలుకు 5 కిలోల చొప్పున, రైస్ మిల్లర్లు దోపిడీ చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సొంత నియోజకవర్గంలో రైతుల దోపిడీని అరికట్టాల్సిన మంత్రి నాకేం సంబంధం లేదని, రైస్ మిల్లర్లతో మీరే మాట్లాడుకోండి, అంటూ మంత్రి అనడం దారుణం అని జీవన్ రెడ్డి అన్నారు. రైస్ మిల్లుల వద్ద ‘ధర్మ కంటా’ ఎలక్ట్రానిక్ బిల్లులో తూకం వివరాలు, ట్రక్ షీట్ లో నమోదు అయిన ధాన్యం వివరాలకు ఉన్న వ్యత్యాసమే, ధాన్యం దోపిడికి ప్రత్యక్ష నిదర్శనం అని జీవన్ రెడ్డి అన్నారు. రైస్ మిల్లర్లు అధిక తూకం వేసి ధాన్యం దోపిడీ చేశారని, టీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతాంగం మినహా మిగతా అందరు రైతులు దోపిడికి గురి అయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. తాను ధాన్యం దోపిడీని నిరూపించ లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.,

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహ రాజ ప్రసాద్, నాయకులు వేముల రాజేష్ శ్రీపతి సత్యనారాయణ, జాజాల రమేష్, రఫీ, అయోరి మహేష్ బాలా గౌడ్ , మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Also Read : రౌడీయిజం, ఈడీయిజం, ఐటీయిజం: జీవన్ రెడ్డి 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com