దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటును ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి మద్దతు ప్రకటించి కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ నిర్ణయం పట్ల మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) రథసారథి హెచ్ డీ దేవేగౌడ సంతోషం వ్యక్తం చేశారు. కేఆర్‌టీఏ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షుడు సందీప్ మఖ్తల, సెక్రటరీ జనరల్ ఈవీ సతీష్ మరియు కేఆర్టీఆఏ బృందాన్ని తమ నివాసానికి ఆహ్వానించిన దేవేగౌడ, ఆరోగ్యం సహకరించకపోయినా దాదాపు గంటపాటు వారితో సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్, కేఆర్‌టీఏ ఆకాంక్షలు సఫలికృతం కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలపడంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అధికంగా నివసిస్తున్న కర్ణాటకలో వారికి ఒక వేదికగా ఉండటం, కర్ణాటకలో పంపణ తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేయడమే లక్ష్యంగా కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్‌టీఏ)ను 2012లో సందీప్ కుమార్ మఖ్తల ఏర్పాటు చేశారు. తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాలు, అలయ్- బలయ్‌లను ఏటా నిర్వహిస్తూ బెంగళూరులోని తెలంగాణవాసులు, సీమాంధ్రకు చెందిన వారి పక్షాన మన సంస్కృతి, ప్రత్యేకతలను చాటి చెప్తున్నారు. 2017లో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను కలిసి బెంగళూరులో పంపణ తెలంగాణభవన్ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. 2018 ఎన్నికల సమయంలో, అప్పటి ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ ముఖ్య నేత సిద్ధరామయ్య, జేడీ (ఎస్) రథసారథి, మాజీ ప్రధాని దేవేగౌడ, బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి, కీలకనేత యడ్యూరప్పన కలిసి పంపన తెలంగాణ భవన్ ప్రాధాన్యతను తెలిపి మేనిఫెస్టోలో పొందుపర్చాలని కోరారు. జేడీ (ఎస్) తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు భవనం ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఎన్నికల అనంతరం జేడీ (ఎస్) అధికారంలోకి రాగానే ఎకరం స్థలం కేటాయించే ప్రక్రియను మొదలుపెట్టి ఈ మేరకు అనుమతి పత్రం కేఆర్‌టీఏకు అందజేసింది. తాజాగా బీఆర్ఎస్ రూపంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టగా, దానికి కేఆర్‌టీఏ మద్దతు తెలిపింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నిర్ణయానికి జేడీ (ఎస్) ఆది నుంచి అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కేఆర్‌టీఏ సంఘీభావం నేపథ్యంలో కేఆర్‌టీఏ అధ్యక్షుడు సందీప్ మఖ్తల, సెక్రటరీ జనరల్ ఈవీ సతీష్ నాయకత్వంలోని బృందాన్ని జేడీ (ఎస్) రథసారథి దేవేగౌడ తమ నివాసానికి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంతో తన అనుబంధం నెమరువేసుకున్న దేవేగౌడ, ఉద్యమ సమయంలో సందీప్ మఖ్తల నాయకత్వంలోని కేఆర్టీఏ సభ్యులు తనను పలు మార్లు కలిసి ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను స్పష్టంగా వివరించేవారని దేవేగౌడ గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ లో నిర్వహించిన సభలో తాను పాల్గొన్న సందర్భం విశేష అనుభూతి కలిగించిందని తెలిపారు. తెలంగాణ వారిలో పోరాట స్ఫూర్తి ఎక్కువ అని ఆయన అన్నారు. గులాబీ దళపతి కేసీఆర్ బీఆర్ఎస్ నిర్ణయం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు జేడీ (ఎస్) అండగా ఉంటుందని పేర్కొంటూ, తెలంగాణ భవన్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం లేఖ ఇవ్వడమే దీనికి తాజా ఉదాహరణ అని వెల్లడించారు.
కేఆర్‌టీఏ అధ్యక్షుడు సందీప్ మఖ్తల, సెక్రటరీ జనరల్ ఈవీ సతీష్ ద్వారా తెలంగాణతో సహా దేశంలోని రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణలో దక్కుతున్న సంఘీభావంతో పాటుగా కేఆర్‌టీఏ రూపంలో మద్దతు దక్కడం సంతోషమని దేవేగౌడ పేర్కొన్నారు. కేఆర్‌టీఏకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.