Sunday, January 19, 2025
HomeTrending Newsవరద బాధిత ప్రాంతాల్లో సాయానికి మిలిటరీ

వరద బాధిత ప్రాంతాల్లో సాయానికి మిలిటరీ

Military Help : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరగా 68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ (INFRANTRY ), 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తున్నాయని వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలుగా ఉన్న ఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు, ఐదుగురు జేసీఓ లు, 92 వివిధ ర్యాంకుల వారున్నారని సి.ఎస్ తెలిపారు.


సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక బోట్ లను సిబ్బందితో సహా భద్రాద్రి జిల్లాకు పంపామని తెలిపారు. ఫైర్ విభాగానికి చెందిన 7 బోట్ లు సిద్ధంగా ఉన్నాయన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది స్విమ్మర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి కాలరీలు ఎం.డి. ఎం. శ్రీదర్ లను ప్రత్యేక అధికారిగా నియమించామని సోమేశ్ కుమార్ వివరించారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ పునరావాస చర్యలకు ఉపయోగించాలని ఆదేశించారు. అత్యవసర సేవల కోసం హెలికాప్టర్ కూడా సిద్దంగా ఉందని వెల్లడించారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ములుగు, భూపాల పల్లి, పెద్ద పల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సి.ఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం కలుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సి.ఎస్. అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్