Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

అసమర్థ విధానాలు, పరిపాలనతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి భారత దేశ ప్రజలకు కాస్తయినా విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు కన్నా దిగువకు భారీగా తగ్గుతున్నా, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఆమేరకు పెట్రో భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మోడీ నాయకత్వంలోని కేంద్రం, పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ చేస్తున్న వాదనలో డొల్లతనం ఇప్పుడు మరోసారి బయటపడుతున్నదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతూనే వచ్చిందని, కాని ఘనమైన మోడీ పాలనలో, దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయన్నారు. రేట్లు పెంచిన ప్రతిసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.

అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందో ఏమో అన్న కుటిల అలోచనతో మోడీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతున్నదని కేటీఆర్ విమర్శించారు.  2014 నుంచి ఇప్పటిదాకా పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా పెట్రో ధరలను మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదులసార్లు పెంచిందని కేటీఆర్ తెలిపారు. కార్పోరేట్ల పాదసేవ చేస్తూ, జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతూ, దేశంలోని ఒక్కో వ్యవస్థను కబళిస్తూ మోడీ సర్కార్ జనాలను పీక్కుతింటున్నదన్నారు. ఇప్పటివరకు పెట్రో పన్నులు, సెస్సుల రూపంలో 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా జనం జేబుల నుంచి దౌర్జన్యంగా దోచుకున్న మోడీ ప్రభుత్వం, మరోవైపు బ్యాంకుల నుంచి కార్పోరేట్ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. మోడీ ప్రేమ కార్పోరేట్ కంపెనీలపైననే కానీ, కాయ కష్టం చేసుకునే దిగువ, మద్యతరగతి వారిపై కాదన్నారు.

పెట్రో రేట్ల పెరుగుదల అనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్రమోడీ, ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో తాను ఘోరంగా విఫలం అయ్యారని ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్‌ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదని, 2015 జనవరి నాటికి అది 50 డాలర్లకు, 2016 జనవరిలో అయితే 27 డాలర్లకు పడిపోయిందన్నారు. ఇక 2020లో కరోనా లాక్‌డౌన్‌ అప్పుడు బ్యారెట్ ముడిచమురు ధర ఏకంగా 11 డాలర్లకు సైతం పడిపోయిందన్నారు. కానీ దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం ఏనాడు పెట్రో ధరలను అమేరకు తగ్గించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబరు మధ్యనే పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్‌ మీద ఏకంగా 154 శాతం పెరిగిందన్నారు.

పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోడీ సర్కార్, దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందన్నారు. 2020 వరకు పెట్రోల్, డిజీల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ సైతం చేసిందన్నారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని సైతం సవరించిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీదని కేటీఆర్ మండిపడ్డారు. కోవిడ్ మహమ్మారితో ఓ వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా మోడీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందన్నారు. ఒక అంచనా ప్రకారం 2020 నాటికే మోదీ సర్కారు ఒక్క ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలోనే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందన్నారు. సెస్సులు, పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం 26 లక్షల కోట్ల రూపాయాలను ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోడిదన్నారు.

ఇక కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వచ్చేదే చాలా తక్కువన్న కేటీఆర్, రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోడీ సర్కార్, పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచిందన్నారు. సెస్సుల రూపంలో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తూ తన ఖజానా నింపుకుంటుందని కేటీఆర్ అరోపించారు. కేంద్ర సెస్సులు కాకుండా విధించిన ఒక్క పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్ పైనా ప్రజలకు దాదాపుగా 30 రూపాయల వరకు ఉపశమనం లభిస్తుందని కేటీఆర్ అన్నారు. పెట్రో రేట్లు పెరిగితే అటోమెటిక్ గా రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని, అడ్డూ అదుపు లేకుండా మోడీ సర్కార్ పెంచిన పెట్రో రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

పేదోడు దేన్నీ కొనలేకపోతున్నాడని, మధ్యతరగతి బడ్జెట్ తలకిందులైందని, పేద, మధ్యతరగతి వర్గాల పరిస్దితులు పూర్తిగా దిగజారిపోయాని కేటీఆర్ అవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజల పట్ల కనికరంలేని ప్రధాని మోడీ పెట్రో ధరలు తగ్గించడం లేదన్నారు. పైగా సెస్సులు, సుంకాల పేరుతో దోపిడీ చేస్తునే, అ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతూ, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది నయవంచనకు పరాకాష్ట అన్నారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదనని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భరమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా, లాక్ డౌన్, కేంద్ర ప్రభుత్వ విఫల విధానాల ఫలితంగా ఉపాధులు కోల్పోయిన నేపథ్యంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఉన్న అన్ని రకాల సెస్సులను రద్దు చేసి పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com