Sunday, January 19, 2025
HomeTrending Newsపాత బస్సు.. ఇప్పుడు తరగతి గది!

పాత బస్సు.. ఇప్పుడు తరగతి గది!

విద్యార్థులకు కాలేజీ ఇష్టమే. అక్కడున్న వాతావరణమూ ఇష్టమే. అక్కడ పరిచయమయ్యే స్నేహితులూ ఇష్టమే. కానీ చాలా మందికి తరగతి గది ఇష్టముండదు.
ఈ కారణంగా క్లాసులు కట్ చేసి కాలేజీ క్యాంటీన్లోనో లేక ఏదో ఒక చోట ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోవడం ఇష్టం. అటువంటి విద్యార్థులను క్లాసుకి రప్పించి పాఠాలు నేర్చుకోవడం కొన్ని విద్యాలయాలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. కేరళలోని తిరువనంతపురంలో అటువంటి ప్రయత్నం జరిగింది.

కేరళ విశ్వవిద్యాలయం కారియవట్టం ఆవరణలోనే ఈ వినూత్న ప్రయోగం చోటుచేసుకుంది.

కార్యవట్టం (Kariavattom campus)
ప్రాంగణంలో కంప్యుటేషనల్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ (Computational Biology and Bioinformatics) విభాగం ఓ తరగతిగదిని ఏర్పాటు చేసి విద్యార్థులను క్లాసుకి డుమ్మా కొట్టకుండా చేసింది.

విద్యార్థులకు కొత్త వాతావరణం తప్పనిసరి అనుకుని సంబంధిత శాఖ ప్రొఫెసర్ అచ్యుతానంద శంకరదాస్ ఈ ప్రయోగానికి నాందీ పలికారు. ఆ శాఖకు ఇంఛార్జ్ ఆయనే. ఆయన పూనుకోవడంవల్లే ఓ వినూత్న తరగతి గది తయారయ్యింది.

ఆ కథాకమామీషేమిటో చూద్దాం….

నిజానికి డాక్టర్ శంకరదాస్ ఓ రైలుబోగీని విశ్వవిద్యాలయ క్యాంపస్సుకి తరలించి దానినే తరగతిగా మార్చాలనుకున్నారు.
కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఆయన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖను సంప్రతించి అనుకున్నది సాధించడం విశేషం. విద్యార్థులు చదువుకుని బాగుపడాలన్నదే డాక్టర్ అచ్యుత శంకరదాస్ అభిమతం.

నాలుగేళ్ళ క్రితం కేరళ విశ్వవిద్యాలయం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు ఓ దరఖాస్తు పెట్టుకుంది. కానీ సంబంధిత శాఖ స్పందించలేదు. అయితే ఇటీవల కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మేనేజింగ్ డైరెక్టరు బిజు ప్రభాకరుకి మరో అర్జీ పెట్టుకుంది. అందుకు స్పందించిన ఆర్టీసీ ఎండి ఓ పాత బస్సు ఇవ్వడానికి ముందుకొచ్చారు.

పనికిరాని పాత బస్సుని స్క్రాప్ scrap కింద అమ్మితే దాదాపు రెండు లక్షల రూపాయలు ఆర్టీసీకి లభిస్తాయి. కానీ విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యం కోసం అడగడంతో రోడ్డు రవాణా శాఖ విశ్వవిద్యాలయానికి బస్సుని ఉచితంగా ఇచ్చింది. డిపో నుంచి తమ క్యాంపస్ కి తరలించడానికి కావలసిన క్రేన్ ఖర్చుని మాత్రం విశ్వవిద్యాలయం భరించింది. ఆ పాత బస్సులో బల్బులు, ఫ్యాను అమర్చారు. బస్సులోపల అక్కడక్కడ ఆణిముత్యాల్లాంటి కొన్ని కొటేషన్సుని మళయాలంలో రాసారు. ఇట్లా ఆ బస్సుకి తరగతి గది రూపం తీసుకురావడానికి ఓ నెలరోజులు పట్టిందని డాక్టర్ శంకరదాస్ తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సుకతతో క్లాసుకి రావడంతో తన లక్ష్యం నెరవేరిందన్నారు. తనకు సహకరించిన విశ్వవిద్యాలయ అధికారులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

ఇప్పుడీ తరగతి గది తమకెంతో నచ్చిందని, డుమ్మా కొట్టకుండా క్లాసులకి వెళ్తున్నామని విద్యార్థులు చెప్పారు. పాఠాలు చెప్పే మాష్టార్లకు కూడా ఈ వినూత్న తరగతి గది ఎంతగానో నచ్చింది.

– యామిజాల జగదీశ్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్